HC Expresses Anger Over Violation: సహకార సంఘాల ఇన్‌చార్జుల నియామకంలో ఆదేశాల ఉల్లంఘన
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:18 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎ్‌స)కు ప్రస్తుతం ఉన్న చైర్మన్లనే పర్సన్ ఇన్‌ఛార్జి చైర్మన్(పీఐసీ)లుగా కొనసాగించాలన్న తమ ఆదేశాలను...
హైకోర్టు ఆగ్రహం.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎ్‌స)కు ప్రస్తుతం ఉన్న చైర్మన్లనే పర్సన్ ఇన్‌ఛార్జి చైర్మన్(పీఐసీ)లుగా కొనసాగించాలన్న తమ ఆదేశాలను ఉల్లంఘించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కాదని అధికారులను పీఐసీలుగా నియమించడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని వ్యవసాయ, సహకారశాఖ కార్యదర్శి, కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా రాజంపేట్ గ్రామానికి చెందిన నల్లవెల్లి అశోక్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అధికారులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 30కు వాయిదా వేశారు. ఇదే విషయమై మరికొందరు వేసిన పిటిషన్లను కూడా న్యాయమూర్తి పరిశీలించారు. పీఐసీలుగా అధికార్లను నియమిస్తూ వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీవో 597ను సవాల్ చేస్తూ రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) పర్సన్ ఇన్‌ఛార్జి చైర్మన్(పీఐసీ) బీ పాండు, జోగులాంబ గద్వాల్ జిల్లా లీజ గ్రామ పీఏసీఎస్ పర్సన్ ఇన్‌ఛార్జి చైర్మన్ పీ మధుసూదన్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ టీకే శారద, సభ్యులు పీ దేవేందర్‌రెడ్డి, బీ ఉస్సేనీ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.