Share News

మన శంకర వరప్రసాద్‌కు దక్కని ఊరట

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:22 AM

ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా నిర్మాణ సంస్థ షైన్‌ స్ర్కీన్‌ ఇండియాకు హైకోర్టులో ఊరట లభించలేదు. భవిష్యత్తులో సినిమా టికెట్‌ రేట్లను పెంచితే ఆ విషయాన్ని 90 రోజుల ముందే పబ్లిక్‌ డొమైన్‌లో......

మన శంకర వరప్రసాద్‌కు  దక్కని ఊరట

  • 90 రోజుల గడువుపై జోక్యానికి డివిజన్‌ బెంచ్‌ నిరాకరణ

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా నిర్మాణ సంస్థ షైన్‌ స్ర్కీన్‌ ఇండియాకు హైకోర్టులో ఊరట లభించలేదు. భవిష్యత్తులో సినిమా టికెట్‌ రేట్లను పెంచితే ఆ విషయాన్ని 90 రోజుల ముందే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని పేర్కొంటూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ జడ్జి వద్దే వాదనలు వినిపించి అక్కడే తేల్చుకోవాలని సూచించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు అయినందున అందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ సినిమా టికెట్‌ రేట్ల పెంపు విషయం ముందే చెప్పనందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఇటీవల సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు భవిష్యత్తులో ఏదైనా సినిమాకు టికెట్‌ రేట్లు పెంచితే చట్టం ప్రకారం 90 రోజుల ముందే దానిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి, అభ్యంతరాలు వినాలని ఆదేశాలు జారీచేశారు. 90 రోజుల ముందే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలనే ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఈ సినిమా నిర్మాణ సంస్థ తాజాగా డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఆ విషయాలన్నీ సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోవాలని పేర్కొంది.

Updated Date - Jan 28 , 2026 | 04:22 AM