Telangana High Court: విద్యుత్తు కనెక్షన్ తొలగింపునకు అనుమతేంటి?
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:27 AM
విద్యుత్ కనెక్షన్ తొలగించాలా, వద్దా అని తమను ఎలా అడుగుతారంటూ సంబంధిత అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. బకాయిల విషయమై చట్ట ప్రకారంచర్యలు...
చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి: హైకోర్టు
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కనెక్షన్ తొలగించాలా, వద్దా అని తమను ఎలా అడుగుతారంటూ సంబంధిత అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. బకాయిల విషయమై చట్ట ప్రకారంచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి కింద రూ.కోటి చెల్లించాలంటూ దక్షిణ డిస్కం నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తాజ్ మహల్ హోటళ్ల తరఫున సుందర్ తాజ్ మహల్ హోటల్స్, కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. వివరాలను పరిశీలించిన డిస్కం.. క్రాస్ సబ్సిడీ సర్‌ఛార్జి నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యుత్ సంస్థ తరఫు న్యాయవాదివాదిస్తూ అన్నింటినీ పరిశీలించిన తరువాత సర్‌ఛార్జి విధించాలని నిర్ణయించామని, కనెక్షన్ తొలగింపునకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప కోర్టు ఆదేశాలు కోరడం సబబు కాదంటూ మందలించారు. విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.