మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల రేట్ల పెంపుపైముందే ఎందుకు చెప్పలేదు?
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:18 AM
మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి తమకు ముందే వెల్లడించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌పై హైకోర్టు తీవ్ర ఆగహ్రం
రేట్లు పెంచాల్సి వస్తే 90 రోజుల ముందే తెలపాలని సర్కారుకు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి తమకు ముందే వెల్లడించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ‘రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మెమో జారీచేసిన 8వ తేదీనే.. ‘మన శంకర వరప్రసాద్ గారు ’ టికెట్ రేట్లను సైతం పెంచుతూ మెమో జారీ అయింది. కానీ ఆ మెమో గురించి బయటకు చెప్పలేదు. దీంతో ‘రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్ల పెంపును మాత్రమే హైకోర్టు సస్పెండ్ చేసింది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాకు సంబంధించి 8వ తేదీన జారీచేసిన మెమోను 10 తేదీన బయటపెట్టారు. కానీ ఆరోజు నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఆ మెమోను సవాల్ చేస్తూ దాచేపల్లి చంద్రబాబు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపించారు. 8వ తేదీన మెమో ఇచ్చి 10న దానిని బయటపెట్టారని.. ఇది అక్రమమని పేర్కొన్నారు. టికెట్ రేట్ల విషయంలో జీవో 120ని కచ్చితంగా అమలు చేయాలని, మెమోలు ఇవ్వరాదని.. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మెమో ఇవ్వడమే కాకుండా దానిని, హైకోర్టుకు సెలవులు ప్రారంభమైన తర్వాత బయటపెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్ రేట్ల పెంపును తమ దృష్టికి ముందే ఎందుకు తీసుకురాలేదని హోం శాఖ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది తగిన సమాధానం ఇవ్వలేదు. టికెట్ రేట్ల పెంపు మెమోలు ఇవ్వరాదని.. జీవో 120 (టికెట్ రేట్ల నిర్ధారణ జీవో)ని కచ్చితంగా పాటించాలని ఈనెల 9న స్పష్టమైన తీర్పు ఇచ్చామని.. అయినా 8వ తేదీ మెమోను 10వ తేదీన బయటపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు మెమో ఇచ్చిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తూ.. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. అలాగే ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీని సుమోటోగా ఇంప్లీడ్ చేసి.. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది.
మూడు నెలల ముందే..
తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ - 1955 సెక్షన్ 7ఏలో స్పష్టంగా పేర్కొన్న విధంగా ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సదరు నిర్ణయాన్ని సినిమా రిలీజ్ కంటే 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని.. ప్రభావిత వ్యక్తులు లేదా బాధితులు లేదా ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే సెక్షన్ 7ఏ ప్రకారం వారి వాదన వినిపిస్తారని..ఆ వాదన విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.