Share News

ఆధార్‌, అటెండెంట్‌ లేకుంటే వైద్యం చెయ్యరా?

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:00 AM

ఆధార్‌ కార్డు, వెంట సహాయకులు(అటెండెంట్‌) లేకపోతే రోగికి వైద్యం చెయ్యరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ఆధార్‌, అటెండెంట్‌ లేకుంటే వైద్యం చెయ్యరా?

  • మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఆధార్‌ కార్డు, వెంట సహాయకులు(అటెండెంట్‌) లేకపోతే రోగికి వైద్యం చెయ్యరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన వీ రవి కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మహబూబాబాద్‌ జిల్లా సివిల్‌ ఆస్పత్రికి వెళ్లారు. రవి వెంట అటెండెంట్‌, ఆధార్‌ కార్డు లేవని ఆస్పత్రి సిబ్బంది అతడిని అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో వైద్యసాయం కోసం అక్కడి క్యాంటీన్‌ వద్ద మూడు రోజులు పాటు ఎదురుచూసిన రవి స్పృహ కోల్పోయారు. అయితే, రవి మరణించాడని భావించిన ఆస్పత్రి సిబ్బంది అతడిని మార్చురీకి తరలించారు. రవి శరీరంలో కదలిక ఉన్నట్టు గుర్తించిన మార్చురీ స్వీపర్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రవిని ఆస్పత్రికి తరలించారు. అయితే, గుర్తింపు కార్డు లేదని వైద్యం నిరాకరించడం విశ్వాస ఘాతుకం కిందికే వస్తుందని పేర్కొంటూ బత్తిని కొమురయ్య అనే న్యాయవాది ఈ ఘటనపై హైకోర్టుకు లేఖరాశారు. ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం.. ఆధార్‌కార్డు లేదని అత్యవసర వైద్యం నిరాకరించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని, ఇలాంటి పరిస్థితులపై ఏమైనా ప్రభుత్వ పాలసీ లేదా మార్గదర్శకాలు జారీ చేసి ఉంటే సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, వైద్యం నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ చీఫ్‌ సెక్రటరీ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Feb 13 , 2026 | 06:00 AM