Share News

హవాలాలో అదృశ్య హస్తాలు!

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:01 AM

రాజధాని హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని వేల కోట్ల రూపాయల హవాలా దందా కొనసాగిస్తున్న బ్రోకర్లు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు, తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.

హవాలాలో అదృశ్య హస్తాలు!

  • హవాలా దందాలో టాప్‌ లేయర్‌ను అందుకోలేకపోతున్న పోలీసులు

  • రూ.547 కోట్ల ఖమ్మం సైబర్‌ స్కామ్‌లో హవాలా మాయ

  • పలు కేసుల్లో ఒక దశ వరకూ వచ్చి ఆగిపోతున్న దర్యాప్తు

  • ఈడీ, తెలంగాణ పోలీసులకు సవాల్‌గా మారిన సమస్య

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని వేల కోట్ల రూపాయల హవాలా దందా కొనసాగిస్తున్న బ్రోకర్లు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు, తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అరకొర సందర్భాల్లో హవాలా సొమ్మును పట్టుకుంటున్నా.. పాత్రధారులు మాత్రమే పైకి కనిపిస్తున్నారు. ఈ దందాను నడిపిస్తున్న అసలు సూత్రధారులు మాత్రం తెరవెనుకే రహస్యంగా ఉండిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హవాలా దందాలో టాప్‌ లేయర్‌ను టచ్‌ చేయడం పోలీసులకు అసాధ్యంగా మారిందంటే అతిశయోక్తి కాదు. హవాలా లింకులను ఛేదించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించడం.. దర్యాప్తు అధికారులకు ఒక సవాల్‌గా నిలుస్తోంది. నిన్నమొన్నటి వరకూ బ్లాక్‌మనీ తరలింపులో కీలకపాత్ర పోషించిన హవాలా ఆపరేటర్లు.. ఇప్పుడు డ్రగ్స్‌ ముఠాలు, సైబర్‌ నేరగాళ్లకు సైతం సాయపడుతున్నారు.


ఖమ్మం జిల్లాలో రూ.547 కోట్ల మ్యూల్‌ బ్యాంకు ఖాతాల వ్యవహారంతో ఈ విషయం బయటడింది! సైబర్‌ నేరాలకు పాల్పడ్డ ముఠా జనం నుంచి కొట్టేసిన సొమ్మును హవాలా మార్గం ద్వారా దుబాయ్‌, కంబోడియా, వియత్నాం, మయన్మార్‌కు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ చౌదరి సహా 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని విద్యార్థులు, యువతకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను వికా్‌సచౌదరి ముఠా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడడం ద్వారా వచ్చిన రూ.547 కోట్లు ఈ ఖాతాలకు చేరాయి. వికాస్‌ చౌదరి ముఠా ఆ డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి డ్రా చేసి హవాలా ఆపరేటర్ల ద్వారా విదేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు పంపారు. ఈ నెట్‌వర్క్‌లో మ్యూల్‌ ఖాతాలను ఇచ్చిన వారిని, బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. వందలకోట్ల డబ్బును తరలించిన హవాలా ఆపరేటర్లను మాత్రం ఇప్పటి వరకూ అరెస్టు చేయలేక పోయారు.


మరో కేసు..

హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన సిద్రా ఎంటర్‌ప్రెజెస్‌ సంస్ధ యజమాని అమీర్‌.. ఇటీవల తన వద్ద పనిచేసే ఇద్దరు వ్యక్తులకు సగం చినిగిన పది రూపాయల నోటు ఇచ్చి కూకట్‌పల్లిలో ఒక వ్యక్తిని కలవమని చెప్పి పంపాడు. వారు అక్కడికి వెళ్లి, తమ యజమాని చెప్పిన వ్యక్తిని కలిసి ఆ నోటును చూపించడంతో.. ఆ వ్యక్తి ఒక అట్టపెట్టెలో కోటి రూపాయల నగదు తీసుకొచ్చి వారికి ఇచ్చాడు. తాము హవాలా ఆపరేటర్‌ వద్ద పనిచేస్తున్నామని గతంలోనే గుర్తించిన వారిద్దరూ.. అప్పటికే ఆ డబ్బును కొట్టేయడానికి పథకం వేశారు. తమ మనుషులతో దాడి చేయించి.. దోపిడీ జరిగిందంటూ కట్టుకథ అల్లారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. కొన్ని గంటల వ్యవధిలోనే అసలు గుట్టు రట్టు చేశారు. దోపిడీ నాటకంలో పాల్గొన్నవారిని అరెస్టు చేసి రూ.77 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే పోలీసులకు ట్విస్ట్‌ ఎదురైంది. వారు స్వాధీనం చేసుకున్న ఆ డబ్బు కోసం సిద్రా ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని అమీర్‌ రాలేదు. ఆ సొమ్ముతో తనకు సంబంధం లేదని చెప్పి తప్పించుకోబోయాడు. దీంతో ఆ రూ.77 లక్షలను పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి అమీర్‌ మనుషులు ఆ డబ్బును కొట్టేసేందుకు పథకం వేయకపోతే.. దాన్ని తీసుకెళ్లి నాచారంలో మరో వ్యక్తికి అప్పగించాల్సి ఉండేది. అక్కడి నుంచి ఆ డబ్బు మరో చోటికి చేరేది. ఫైనల్‌గా ఆ డబ్బు వెళ్లాల్సింది దుబాయికి. ఈ కేసులో వారికి రూ.కోటి ఇచ్చిన వ్యక్తిని పోలీసులు గుర్తించలేదని సమాచారం. అమీర్‌ను కస్టడీలోకి తీసుకుని అతని ఫోన్‌కాల్‌ లిస్టు పరిశీలిస్తే కానీ అసలు కథబయటపడదు.


ఈ ఒక్క కేసే కాదు. ఇలా అనేక సంఘటనల్లో హవాలా డబ్బును అటు ఈడీ, తెలంగాణ పోలీసులు పట్టుకుంటున్నారు కానీ, ఆ డబ్బు ఎవరిది? ఎక్కడికి వెళ్తోంది అనే విషయాలపై దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి దేశంలోనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి హవాలా పద్ధతిలో డబ్బు పంపాలంటే అవసరం, సమయాన్ని బట్టి 1-5ు కమీషన్‌ తీసుకుంటారు. వేరే దేశాలకు పంపాలంటే 5 నుంచి 10 శాతం కమీషన్‌ తీసుకుంటారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో హవాలా ఆపరేటర్‌ డబ్బు తీసుకున్నాక, ఆ డబ్బు ఎక్కడికి చేరాలో ఆ నగరంలో ఉన్న తమ నెట్‌వర్క్‌ పార్టనర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తాడు. ఆ పార్టనర్‌ ద్వారా అక్కడున్న వారికి డబ్బు చేరిపోతుంది. ఇదంతా కొన్ని గంటల వ్యవధిలోనే జరుగుతుంది. సైబర్‌ నేరాలను అరికట్టే క్రమంలో భాగంగా.. ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌’ పేరిట తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో మ్యూల్‌ ఖాతాలతో పాటు హవాలా లింకులు బయటపడ్డాయి. కానీ, హవాలా ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను పూర్తి స్ధాయిలో చేధించడంలో మాత్రం అన్ని దర్యాప్తు సంస్థలూ విఫలమవుతున్నాయి. టాప్‌ లేయర్‌ వ్యక్తులు చాలావరకు విదేశాల్లో ఉండటంతో వారిని గుర్తించడం, అరెస్టు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

Updated Date - Mar 22 , 2026 | 06:02 AM