kumaram bheem asifabad- కొత్త గ్యాస్ కనెక్షన్‌కు అవస్థలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:13 PM
కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచి పోవడడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా నిషేధం అమలు చేస్తోంది. గత మార్చి నుంచి ఏజెన్సీలు, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఇప్పటి వరకు లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటంలు, వేరు కాపురాలు పెట్టిన వారు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
-పేరుకుపోతున్న దరఖాస్తులు
కాగజ్‌నగర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచి పోవడడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా నిషేధం అమలు చేస్తోంది. గత మార్చి నుంచి ఏజెన్సీలు, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఇప్పటి వరకు లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటంలు, వేరు కాపురాలు పెట్టిన వారు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏజెన్సీల వద్ద మూడువేలకుపైగా చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగం పెరుగడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించ లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్లపై అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇంధన దిగుమతి సరిగా లేక పోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
- జిల్లాలో పరిస్థితి ఇలా..
ఆసిఫాబాద్ జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండెన్ కంపెనీల ఏజెన్సీలున్నాయి. పట్టణ పరిధిలోని వినియోగదారులకు 21 రోజులు, గ్రామీణ ప్రాంతాల వారికి 45 రోజుల అంతరంతో సిలిండర్లను బుకింగ్ చేసుకునేలా నిబంధనలు మార్చడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల జిల్లాలో నూతన రేషన్ కార్డులు పొందడంతో వారిలో అనేక మందికి నూతన గ్యాస్ కనెక్షన్లు లేవు. మహాలక్ష్మి పథకంలో రూ.500 రాయితీకే సిలిండర్ పొందుతుండగా, ఈ పథకానికి దరఖాస్తులు కొత్త వారు చేసుకున్నప్పటికీ కూడా ఫలితం లేని పరిస్థితి ఉంది. అలాగే దీపం పథకం లబ్ధిదారులు చని పోతే వారి పేరిట ఉన్న కనెక్షన్లు వారి వారసుల పేరిట బదిలీ కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త సిలిండర్ కనెక్షన్లు లేక పోవడంతో చిన్నపాటి విందులు ఏర్పాటు చేసుకున్నా అదనపు సిలిండర్ అందుబాటులో లేక పోవటంతో కట్టెల పోయ్యిపైనే వంటలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.