అవసరమైతే హరీశ్‌ను మళ్లీ పిలుస్తాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:13 AM
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారించారని, తన కుమారుడి విమాన ప్రయాణం ఉందని ఆయన విజ్ఞప్తి చేయడంతో...
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే విచారణ: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారించారని, తన కుమారుడి విమాన ప్రయాణం ఉందని ఆయన విజ్ఞప్తి చేయడంతో, దానిని పరిగణనలోకి తీసుకుని ఈరోజుకు విచారణను ముగించారని హైదరాబాద్ సీపీ, సిట్ ఇన్‌చార్జి వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తుతో సంబందం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని, జోక్యం చేసుకోరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. అవసరమైతే మరోసారి నోటిసులిచ్చి హరీశ్ రావును విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే ఆయనకు నోటీసులిచ్చి విచారిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ 2024 మార్చి నుంచే కొనసాగుతోందని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక విడత చార్జీషీట్‌ను న్యాయస్థానంలో సమర్పించామని తెలిపారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీశ్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.