Share News

KTR: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌పై కక్ష సాధింపు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:14 AM

రాజకీయ వేధింపులకు పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు..

KTR: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌పై కక్ష సాధింపు

  • బొగ్గు స్కామ్‌ బయటపెట్టిన రోజే ఆయనకు సిట్‌ నోటీసులు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయ వేధింపులకు పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్‌ స్పందించారు. రేవంత్‌ రెడ్డి బావమరిది సుజన్‌ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌రావుకు మళ్లీ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఇది ఆ స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనన్నారు. హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని, అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో ఆయ న చూపిస్తున్న చొరవను చూసి రేవంత్‌ రెడ్డికి వణుకు పుడుతోందన్నారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రేవంత్‌ సర్కారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.

నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే..!

తెలంగాణ నేతన్నలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రాజకీయ కక్షను ప్రదర్శిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే సిరిసిల్ల మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయడంలో జాప్యం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు ఆయన లేఖరాశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల మెగా పవర్‌లూమ్‌ క్లసర్‌ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా ఈ క్లస్టర్‌’ను అధికారికంగా ప్రకటించి, పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేటీఆర్‌ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన వచ్చిన నాటి నుంచి చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం జోక్యంచేసుకొని మెగా క్లస్టర్‌ను మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని విమర్శించారు. తెలంగాణను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:14 AM