నోటీసులు ఇవ్వలేదనడం హరీశ్ రావుకు తగదు
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:25 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన అవకాశాలు అన్నింటినీ మాజీ మంత్రి హరీశ్‌రావు సంపూర్ణంగా...
ప్రభుత్వం తరఫున సింఘ్వి వాదన
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన అవకాశాలు అన్నింటినీ మాజీ మంత్రి హరీశ్‌రావు సంపూర్ణంగా వాడుకున్నారని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. సహజ న్యాయం పాటించలేదని హరీశ్‌రావు ఆరోపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అత్యధిక న్యాయం ఆయనే పొందారని తెలిపింది. ఆయన చేసిన వాదనలను ఖండించింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితాసబర్వాల్‌లు హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు కొనసాగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు అప్పటి సీఎంతో కలిసి హరీశ్‌రావు తీసుకున్నారని, వాటిని పూర్తిచేసే క్రమంలో నిపుణుల అభిప్రాయాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటులో రాజకీయ కుట్ర లేదని, అదేమీ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ కాదని చెప్పారు. మేడిగడ్డ సహా ఇతర బ్యారేజీల నిర్మాణంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపైన చేసిన అప్పునకు ఈ ప్రభుత్వం రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతోందని, ఏం జరిగిందో తెలుసుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.