భట్టి రంకెలేస్తే అంకెలు మారవు
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:26 AM
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో...
31 నెలల్లో రేవంత్ చేసిన అప్పు రూ.4.5 లక్షల కోట్లు
బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు
మేం 8.21 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు భట్టి కట్టుకథలు
ప్రభుత్వ పెద్దలు లంచాలిచ్చి అప్పులు తెస్తున్నారు
10 వేల కోట్లకు 170 కోట్లు బ్రోకరేజ్ చార్జీ ఇచ్చారు
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపణ
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల విషయంలో భట్టి అబద్ధాలు, అర్ధసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.8,21,651 కోట్లు అని భట్టి కట్టుకథలు చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం, ఎస్‌పీవీఎస్ గ్యారెంటీ రుణాలు కలిపి రూ.84,268 కోట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఖాతాలో చూపారని చెప్పారు. తాము లేని లెక్కలు చెప్పట్లేదని, శుక్రవారం భట్టి విలేకరుల సమావేశంలో చూపిన పత్రాల్లో ఉన్న లెక్కలే చెబుతున్నామని అన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.15,118 కోట్లు. దీన్ని కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పుల్లో కలిపారు. అంటే రూ.84,268 కోట్లు+రూ.15,118 కోట్లు కలిపి రూ.99,386 కోట్లు. ఈ మొత్తాన్ని 2023 డిసెంబరు 7 నాటికి ప్రభుత్వంపై ఉన్న రుణ బకాయిలు రూ.5,16,881 కోట్ల నుంచి తీసివేస్తే రూ.4,17,495 కోట్ల అప్పు ఉంటుంది. భట్టి లెక్కల ప్రకారం ఎన్ని కలిపినా కాంగ్రెస్ వాళ్లు చెప్పిన రూ.8,21,651 కోట్లు రావట్లేదని, అందులో ఏం ఏం కలిపారో వారే చూసుకోవాల’’ని హరీశ్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు దాటలేదన్న మాటకు కట్టుబడి ఉంటానని, చర్చకు ఎప్పుడైనా సిద్ధమన్నారు. లేని అప్పులను ఉన్నట్లు చూపి గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.6,71,757 కోట్లు అని చెప్పిందని, ఇందులో కూడా తమకు సంబంధం లేనివి కలిపారన్నారు.
శుక్రవారం భట్టి మాట్లాడుతూ రూ.లక్షా 77వేల కోట్ల అప్పు తెచ్చినట్లు చెప్పారని, సీఎం రేవంత్ మార్చి 18న అసెంబ్లీలో మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నాటికి కాంగ్రెస్ చేసిన అప్పులు రూ.3,47,294 కోట్లు అని ప్రకటించారని చెప్పారు. 4 నెలల్లో అప్పులు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కరెక్టా? భట్టి కరెక్టా? చెప్పాలన్నారు. జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్‌లో ఉన్న లెక్కల ప్రకారం 31 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు 4 లక్షల 50 వేల కోట్లు ఉందన్నారు. టీజీఐఐసీ భూములను కుదువపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తేవడానికి ప్రభుత్వపెద్దలు బ్రోకరేజ్ చార్జీ రూ.170 కోట్లు ఇచ్చారని, మొత్తం రూ.30 వేల కోట్లకు చెల్లించింది రూ.510 కోట్లు ఉంటుందన్నారు. దీన్ని బ్రోకరేజ్ అంటారా? లంచం అంటారా? ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు, డిస్కమ్‌లకు మరో రూ.70 వేల కోట్లు అప్పు తెచ్చే లక్ష్యం పెట్టుకున్నారని, ఇందుకు బ్రోకర్లకు రేవంత్ ఇచ్చే లంచం రూ.1,200 కోట్లు ఉంటుందన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేస్తుందని భట్టి చెప్పడం దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.