హిట్లర్ తరహాలో రేవంత్ హంతక భాష
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:07 AM
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జుగుప్సాకరంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని.. తనకు హిట్లర్ ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి అదే తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.
నీళ్లడిగిన రైతులను రాయి కట్టుకొని దూకమంటారా?
పంటలకు మా రక్తం చల్లుతానంటారా?
సీఎంకు.. షాబాద్ నరహంతకుడికీ తేడా లేదు: హరీశ్
హైదరాబాద్/పటాన్‌చెరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జుగుప్సాకరంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని.. తనకు హిట్లర్ ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి అదే తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం మాటల్లో అబద్ధాలు, బూతులు, శాడిజం.. ఈ మూడు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రైతులు సాగునీరు అడిగి తే.. దిగమను, రాయికట్టుకొని దూకమను అని మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. నీళ్లివ్వాలని అడుగుతున్న బీఆర్‌ఎస్ నేతల రక్తాన్ని పంటలపై చల్లాలంటూ శాడిస్ట్‌లా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాల రక్తం కావాలంటున్న రేవంత్‌రెడ్డికి.. షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా చంపిన నరహంతకుడు రాజ్‌కుమార్‌కు పెద్దగా తేడా కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ‘నన్ను జైల్లో పెడితే మీ కసి తీరుతుంది అనుకుంటే.. మీరు నారక్తం అడిగినా, నన్ను జైల్లో వేసినా.. దానికి వంద శాతం సిద్ధంగా ఉన్నా’నని, పంతాలకుపోయి రైతుల పంటలను ఎండబెట్టొద్దన్నారు. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో నడిపించి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడాలని, ఆ క్రెడిట్ అంతా మీరే తీసుకోండని కోరారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే భద్రాచలం మునిగిపోతుందనడం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు.
హిల్ట్ పాలసీతో ఉద్యోగాలకు ఎసరు
‘‘రాష్ట్రంలో హిల్ట్ పాలసీ తీసుకురావడం వల్ల విలువైన పారిశ్రామిక భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పటాన్‌చెరు పారిశ్రామికవాడలో పనిచేస్తు న్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులుపడే అవకాశాలు ఉన్నాయి’’ అని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని సీఎం రేవంత్ అమ్ముకున్నారని ఆరోపించారు.