Share News

పొంగులేటి కాదు.. పొంగులూటీ!

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:13 AM

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పవిత్రమైన సచివాలయంలో కూర్చొని కుమారుడిని కాపాడుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని...

పొంగులేటి కాదు.. పొంగులూటీ!

  • ‘రాఘవ’లో అవినీతి ఉందని ముఖ్యమంత్రే చెబుతున్నారు

  • నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూములైతే రోజుకో బోర్డు ఎందుకు?

  • కుమారుడిని కాపాడుకునే క్రమంలో పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్‌

  • సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి: హరీశ్‌

వనపర్తి/మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పవిత్రమైన సచివాలయంలో కూర్చొని కుమారుడిని కాపాడుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని, ఆయన పొంగులేటి కాదు.. పొంగులూటీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం రాత్రి వనపర్తి జిల్లా రేవల్లి మండలం గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా గొల్లపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో, అంతకుముందు రేవల్లి మండలం నాగపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తోందని, సమాధానం లేనప్పుడు బూతులను వెతుక్కుంటారన్నారు. ఆయన ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోందని, మంత్రిగా కాకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేతగా మాట్లాడారని విమర్శించారు. ఏవో పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకుంటున్నారని, ఈక్రమంలో తానొక్కడే కాదని, సహచర మంత్రులు కూడా అవినీతిపరులేనని పొంగులేటి చెబుతున్నారన్నారు. జూపల్లి కృష్ణారావు, సీఎం కుటుంబ సభ్యుల టెండర్లు, బిల్లుల మంజూరులో భట్టి కమీషన్లు అంటూ ఆయనతో పాటు కలుపుకుంటున్నారని చెప్పారు. మైనింగ్‌ అవినీతిని అధికారులే గుర్తించారని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని, సీఎం చెప్పింది తప్పా, పొంగులేటి చెబుతున్నది తప్పా తేలాలన్నారు. కంటైనర్‌పై రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పేరు, కాంగ్రెస్‌ జెండా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అధికారుల నోటీసు కాపీని అందుకున్న రాఘవ ఉద్యోగి ఇచ్చిన కాపీనే తాను అసెంబ్లీలో చూపించానని చెప్పారు. నాదర్‌గుల్‌లో భూములు కాపాడింది బీఆర్‌ఎస్‌ అని, 2016లో ఆ భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చామని, కంపెనీలు కేసు వేస్తే సింగిల్‌, డివిజన్‌ బెంచ్‌లలో ప్రభుత్వ లాయర్లతో వాదించి గెలిచామన్నారు. ఇప్పుడు పొంగులేటి చెబుతున్నట్లు అవి ప్రభుత్వ భూములైతే ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయని ప్రశ్నించారు. పొంగులేటి చిట్టా చాలా ఉందని, పొంగులేటి, పొగరులేటి, బాంబులేటి వేసిన బాంబులన్నీ తుస్సుమన్నాయన్నారు. అవినీతిని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి అని విమర్శించారు.

Updated Date - Apr 10 , 2026 | 05:13 AM