ప్రజా పాలన అంటే ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించడమా?: హరీశ్
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:23 AM
సమ్మె బాట పట్టిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామనడం ప్రభుత్వ బెదిరింపులకు నిదర్శనమని, ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించడం ప్రజా పాలన అవుతుందా ...
సిద్దిపేట ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): సమ్మె బాట పట్టిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామనడం ప్రభుత్వ బెదిరింపులకు నిదర్శనమని, ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించడం ప్రజా పాలన అవుతుందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆర్టిజన్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించకుంటే వారి పక్షాన బీఆర్‌ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేటలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఆర్టిజన్లు ఆరు రోజులుగా చేపట్టిన నిరవధిక సమ్మె పట్ల హరీశ్‌రావు సోమవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్రంలో 27 వేల మంది ఆర్టిజన్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితేనే అది ప్రజాపాలన అవుతుందన్నారు. కాంగ్రె్‌సది ప్రజాపాలన కాదని తుగ్లక్, రాక్షస పాలన అని మండిపడ్డారు. .