రేవంత్ చేతకానితనాన్ని ఎల్‌నినోపై పెడుతున్నారు!
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:18 AM
కృష్ణా బేసిన్‌లోనే ఉన్న ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీటిని తెచ్చుకోలేక.. రేవంత్‌రెడ్డి తన చేతకానితనాన్ని ‘ఎల్‌నినో’ పైకి నెడుతున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు
యాదాద్రి పవర్ ప్లాంట్ సామర్థ్యంలో పదో వంతే ఉత్పత్తి: హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోనే ఉన్న ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీటిని తెచ్చుకోలేక.. రేవంత్‌రెడ్డి తన చేతకానితనాన్ని ‘ఎల్‌నినో’ పైకి నెడుతున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. శ్రీశైలం నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు.. 700 వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు తరలించుకు పోతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి క్రిష్ణా నదీ జలాలను ఏపీ తీసుకువెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులకు నీళ్లివ్వడం లేదని ఆక్షేపించారు. సీఎం తన సొంత జిల్లా పాలమూరు రైతాంగం పంటలను ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. 4వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి పవర్ ప్లాంట్‌ద్వారా 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని విమర్శించారు. నాసిరకం బోగ్గు వాడటమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని అన్నారు. థర్మల్ పవర్ ేస్టషన్‌లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలన్న నిబంధనను పాటించడం లేదన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలుంటే బొగ్గుకొరత ఎందుకు వస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు 8 గంటల కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ‘ఓ వైపు తెలంగాణలో పంటలు ఎండబెడుతూ.. మన దగ్గర తయారయ్యే సింగరేణి విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వంతో పీపీఏ ఎందుకు కుదుర్చుకున్నార’ని నిలదీశారు.
ఎమ్మెల్సీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందాం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. తెలంగాణభవన్‌లో ఆ మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ వాణీదేవి మరోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐఆర్‌ఎస్ అధికారి ఉదయ్‌నాథ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేందర్ గౌడ్, కాసాని వీరేశ్,అంజయ్య యాదవ్ కుమారుడి పేరు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే అభ్యర్థి ఎవరనేది పార్టీ నేతలు ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం.