ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే..సీఎం రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నారా..?
ABN , Publish Date - May 07 , 2026 | 05:06 AM
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ కాసుబాగ్ కంచలోని వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, ఆ ప్రాంతంలోని చెరువును రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నారా.
నాదర్‌గుల్ కాసుబాగ్ కంచలోని రైతులకు న్యాయం చేయండి: హరీశ్‌రావు
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ కాసుబాగ్ కంచలోని వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, ఆ ప్రాంతంలోని చెరువును రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నారా..? అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ భూములను కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా దాడులు, పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ పలువురు రైతులు బుఽధవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. కబ్జా చేసిన భూములో కంచెలు వేశారని, పక్కనే ఉన్న తమ వ్యవసాయ భూముల్లోని బోర్లను ధ్వంసం చేశారని, దాడుల్లో తాము గాయపడ్డామని పేర్కొంటూ.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రైతులు హరీశ్‌రావుకు చూపించారు. హరీశ్‌రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ సీలింగ్ భూములకు కలెక్టర్, ఆర్డీవోలే కస్టోడియన్లుగా ఉంటారని, ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో అధికారులే ఫైల్ చేశారన్నారు. ఇప్పుడు ప్రైవేట్‌వాళ్లు కంచెలు వేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. ముదిరాజ్‌లకు చెరువులో చేపలు పట్టుకునే హక్కును కల్పించి, చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానళ్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గుడిలో పూజలు చేసుకునేందుకు ప్రజలను అనుమతించాలని అధికారులను హరీశ్‌రావు కోరారు. ఎమ్మార్వోతోనూ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
నిధులివ్వకుండా చైర్మన్లను నియమిస్తే ప్రయోజనమేంటి?
కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద.. నిధులు విడుదల చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి చూపడంలేదని, నిధులే ఇవ్వకుండా చైర్మన్లను నియమిస్తే ఏం ప్రయోజనమని హరీశ్‌రావు ప్రశ్నించారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన నిలదీశారు.