నా ఎత్తుతో నీకేం పని రేవంత్!
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:11 AM
‘‘తాటి చెట్టు లెక్క పెరిగినవు.. ఈత చెట్టు లెక్క పెరిగినవు.. అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నవు.. అసలు నా ఎత్తుతో నీకేం పని’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు అమలయ్యే దాకా అడుగుతూనే ఉంటా: హరీశ్
హుస్నాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘‘తాటి చెట్టు లెక్క పెరిగినవు.. ఈత చెట్టు లెక్క పెరిగినవు.. అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నవు.. అసలు నా ఎత్తుతో నీకేం పని’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పిల్లల కార్యక్రమానికి వెళ్లిన రేవంత్ అక్కడి పిల్లలకు మంచి ముచ్చట్లు చెప్పాల్సింది పోయి, తన గురించి అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘నేను నీకన్నా గట్టిగా తిడుతా. కానీ సంస్కారం అడ్డువచ్చి ఊరుకుంటున్నా’’ అన్నారు. బుధవారం హరీశ్‌రావు ఓటరు జాబితా ప్రక్షాళన(సర్)పై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ‘‘నన్ను ఎంత తిట్టినా, ఎంత గిల్లినా ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటా.. గల్లా పట్టి అడుగుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకొన్న రేవంత్‌రెడ్డికి హిట్లర్ గతే పడుతుందని హెచ్చరించారు.