రేవంత్‌కు దేవుడంటే భయం లేదు.. భక్తి లేదు
ABN , Publish Date - May 12 , 2026 | 04:03 AM
సీఎం రేవంత్‌రెడ్డికి గుడులు, బడులంటే లెక్కే లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో గుడులు, బడుల విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ ఆలయాలు కడితే.. రేవంత్ కూల్చేస్తున్నాడు: హరీశ్
నర్సంపేట, మే 11 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి గుడులు, బడులంటే లెక్కే లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో గుడులు, బడుల విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఇటీవల కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి చారిత్రక శివాలయాన్ని బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘భగవంతుడంటే భక్తి అయినా ఉండాలి. భయమైనా ఉండాలి. రేవంత్‌రెడ్డికి ఆ రెండూ లేవు’’ అని అన్నారు. ‘‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారు. ఇప్పుడు దేవాలయాలను కూడా వదలడం లేదు. కేసీఆర్ ఆలయాలు కడితే.. రేవంత్‌కు కూల్చుడే తప్ప కట్టడం తెలియదు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు. ఇందులో సీఎం ప్రమేయం లేకపోతే దేవాలయాన్ని కూల్చినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీ్‌షరావు ప్రశ్నించారు. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద గొయ్యి తీశారంటే అది గుప్తనిధి కోసమే అని అర్థం అవుతోందన్నారు. ఆలయ కూల్చివేతపై ఈ నెల 7న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. దేవాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని, ఆ స్థలాన్ని, దేవాలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.