Share News

నా పుట్టుక.. ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనే..

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:59 AM

తాను బీఆర్‌ఎస్‌లోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, ఇకపై తన ప్రయాణమంతా కేసీఆర్‌తోనే కొనసాగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే...

నా పుట్టుక.. ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనే..

  • రేవంత్‌ లెక్క పూటకోపార్టీ మారిన చరిత్ర కాదు నాది

  • ’రైతు డిస్కమ్‌’తో తెలంగాణ వ్యవసాయానికి ఉరితాడు: హరీశ్‌

సిద్దిపేట, మే31 (ఆంధ్రజ్యోతి): తాను బీఆర్‌ఎస్‌లోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, ఇకపై తన ప్రయాణమంతా కేసీఆర్‌తోనే కొనసాగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయం వందసార్లు చెప్పానని, ఇంకా ఎన్నిసార్లయినా ఇదే మాట చెబుతానని అన్నారు. ఆదివారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. పూటకో పార్టీ మారినట్లు నాలుగు పార్టీలు తిరిగిన చరిత్ర ఆయనకే ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు అయినట్లుగానే, తన గురించి మాట్లాడిన ప్రతీ మాట కూడా పచ్చి అబద్ధమని అన్నారు. రేవంత్‌ తన ఇంటిపేరును ఎనుములకు బదులుగా అబద్ధాల రేవంత్‌గా మార్చుకోవాలని సూచించారు. రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి, ఆర్పీడీసీఎల్‌ డిస్కంను ఏర్పాటు చేయడం సీఎం రేవంత్‌ తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయమని విమర్శించారు. రైతు డిస్కం పరిధిలోకి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులను తేవడం రాష్ట్ర వ్యవసాయానికి పెద్ద శాపమని అన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రేవంత్‌రెడ్డి రైతు డిస్కం ద్వారా ఉరితాడు బిగించడానికి సిద్దమయ్యారని ఆరోపించారు. రెండున్నరేళ్లలోనే డిస్కంలకు రూ.25,284 కోట్ల బకాయి పడ్డారని తెలిపారు. సూర్యుడు ఉన్నప్పుడే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, మిగతా సమయంలో వ్యవసాయాన్ని, సాగునీటి ప్రాజెక్టులను, మిషన్‌ భగీరథను చీకట్లో ముంచుతారా? అని ప్రశ్నించారు. ఆర్పీడీసీఎల్‌ ఏర్పాటును విరమించుకోకుంటే రాష్ట్రంలో మరో విద్యుత్‌ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Jun 01 , 2026 | 04:59 AM