రేవంత్ రైతుబిడ్డ కాదు.. రైతు ద్రోహి: హరీశ్
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:31 AM
సీఎం రేవంత్ రైతు బిడ్డ కాదని, రైతు ద్రోహి అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని...
రైతుల రుణమాఫీ కోసం హైకోర్టులో రిట్ పిటిషన్
సిద్దిపేట రూరల్/హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రైతు బిడ్డ కాదని, రైతు ద్రోహి అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్‌ను, తనను తిట్టడం ఒక్కటే రేవంత్ పనిగా పెట్టుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. దమ్ముంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడాలన్నారు. తక్షణమే వడ్లు కొనుగోలు చేయకుంటే మూడు.. నాలుగు రోజుల్లో జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని, రైతులతో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తామని, అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కాగా, ప్రభుత్వం అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ హరీశ్‌రావు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. మరోవైపు సిద్దిపేట జిల్లా రైతుల కోసం ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రైతులకు 2లక్షల వరకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్పులు చేసి, వడ్డీకి తెచ్చి మరీ అదనపు మొత్తాన్ని చెల్లించారని, ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. జిల్లాలో అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమచేయాలని పిటిషన్‌లో కోరినట్లు తెలిపారు.