Harish Rao: కమీషన్లు ఉండవని చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులివ్వరా
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:05 AM
కమీషన్ల కోసం.. బడా కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లించే మీరు.. కమీషన్లు రావనే ఉద్దేశంతోనే లక్షల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదా...
ప్రభుత్వ విద్యపట్ల సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదు
‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలి: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘‘కమీషన్ల కోసం.. బడా కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లించే మీరు.. కమీషన్లు రావనే ఉద్దేశంతోనే లక్షల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లు బుధవారం హైదరాబాద్‌లోని హరీశ్ నివాసానికి వెళ్లి ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అప్పులుచేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక.. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, గురుకులాల పిల్లలకు సరిగ్గా అన్నంకూడా పెట్టలేని, చేతగాని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని విమర్శించారు. దీనిపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సంబంధించి రెడీ ఫర్ పేమెంట్ ఉన్న రూ.512 కోట్లు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధిని నిర్వీర్యం చేసేందుకు మోదీ కుట్ర: వీహెచ్
ఉపాధి హామీ నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. దీనిపై ప్రతి గ్రామంలోనూ యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా నుంచి భారతీయులను పంపించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కుట్ర చేస్తున్నారని, దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు.