పోలీసుల లాఠీతో కాంగ్రెస్ రాజకీయం!
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:12 AM
ప్రజాతీర్పును కాదని పోలీసుల లాఠీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ నేతలను బెదిరించేందుకే పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
దాడులకు గురైన బీఆర్‌ఎస్ నేతలపైనే కేసులా?: హరీశ్
ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌తో ములాఖత్
ఆదిలాబాద్, ఫిబ్రవరి19 (ఆంధ్రజ్యోతి): ప్రజాతీర్పును కాదని పోలీసుల లాఠీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ నేతలను బెదిరించేందుకే పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారికి భవిష్యత్తుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గురువారం ఆదిలాబాద్ జైల్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలపై దాడులు చేసి తిరిగి వారిపైనే ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతన్‌పల్లి మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని, మొత్తంగా 22 వార్డుల్లో 14వార్డులను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందన్నారు. దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారని, తొలిరోజు చైర్మన్ ఎన్నికను రసాభాస చేసి వాయిదా వేశారని, మహిళా కౌన్సిలర్లపై మంత్రి వివేక్ అనుచితంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. రెండో రోజు ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఎన్నిక జరిగే చోటుకు 2కి.మీ దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారని.. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అనుమతించారన్నారు. దీన్ని ప్రశ్నించినందుకు బాల్క సుమన్, బీఆర్‌ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. అయితే సమీపంలోని ఆసిఫాబాద్, లక్షేటిపేట, రామగుండం, కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జైలులో కాకుండా 200ల కి.మీల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా తమనేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆదిలాబాద్ జైలు ప్రధాన గేటు ముందు బీఆర్‌ఎస్ శ్రేణులు భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.