Share News

ఢిల్లీకి కప్పం కట్టడంలో సీఎం బిజీ

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:56 AM

ఢిల్లీకి కప్పం కట్టడంపైనే దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

ఢిల్లీకి కప్పం కట్టడంలో సీఎం బిజీ

  • మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణ

గుర్రంపోడు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి కప్పం కట్టడంపైనే దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు రైస్‌మిల్లర్లతో సమావేశమైన మర్నాడే ధాన్యానికి రూ.300 చొప్పున ధర తగ్గిందని... కాంగ్రెస్‌ పాలకులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆదివారం ఆయన గుర్రంపోడు మండలం జిన్నాయిచింతలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల పంటకు కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాకు ఐదు కిలోల చొప్పున, మిల్లుల వద్ద మరో రెండు కిలోలు తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నాడు ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి రైతుల ధాన్యానికి తరుగు తీస్తే తోలు తీస్తానని ప్రగల్భాలు పలికారని అన్నారు. మరి నేడు కాంగ్రెస్‌ పాలనలో తీస్తున్న తరుగుకు ఎవరి తోలు తీయాలో ఆలోచించాలని రైతులకు సూచించారు. రైతు భరోసాలోనూ రేవంత్‌ ప్రభుత్వం దగాకు పాల్పడిందన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 05:57 AM