మహేశ్‌గౌడ్ క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:41 AM
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు లీగల్ నోటీసు పంపారు. క్షుద్రపూజలు చేశారంటూ తనపై చేసిన నేరపూరిత వ్యాఖ్యలకు..
లీగల్ నోటీసు పంపిన హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు లీగల్ నోటీసు పంపారు. క్షుద్రపూజలు చేశారంటూ తనపై చేసిన నేరపూరిత వ్యాఖ్యలకు సంబంధించి తన అడ్వకేట్ ద్వారా హరీశ్ నోటీసులు పంపారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేశారని, మహేశ్‌కుమార్‌గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేస్తామని స్పష్టంచేశారు. ఆధారాల్లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిస్థితి గాల్లో దీపంలా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారమయ్యేలా చూడాలని టీవీవీపీ పరిధిలోని వైద్య ఉద్యోగులు మంగళవారం హరీశ్‌ను ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.