సిద్దిపేటలో నాపై రేవంతే పోటీ చేయాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:11 AM
ఎవరో ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు.
బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు.. రాకేశ్‌రె డ్డి వ్యక్తిగతం
జవాబులు చెప్పలేక సభలో ప్రశ్నలు రాకుండా ఎత్తుగడలు
మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 25, (ఆంధ్రజ్యోతి): ఎవరో ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేటలో హరీశ్‌రావుపై గెలిచిన వ్యక్తిని మంత్రిని చేస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, సీఎం అయ్యేది కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనను స్వాగతిస్తున్నామని, అదే జరిగితే బీఆర్‌ఎ్‌సకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఉంటుందని, గతంలోనూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన 33బీసీ కార్పొరేషన్లకు రెండు బడ్జెట్లలో రూ.14,521కోట్లు కేటాయించారని, కానీ ఖర్చు చేసింది కేవలం రూ.305కోట్లేనని పేర్కొన్నారు. అత్యంత వెనుక బడిన బీసీ వర్గాలకు రూ.801కోట్లు కేటాయించగా... ఖర్చు చేసింది రూ.99 లక్షలని, అది కూడా జీతాలకు వెచ్చించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేశామని చెప్పుకొంటున్న వాటిలో 50,785 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం... బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన పోస్టులు కేవలం 16,978మాత్రమేనని తెలిపారు. ఈ అంశాలపై తాము అడిగిన ప్రశ్నల ప్రస్తావన రాకుండా ఉండేందుకే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నపై గంటన్నర పాటు సభను నడిపించారని ఆరోపించారు. ఇటీవల 10 నిమిషాలపాటు టీ బ్రేక్ అని చెప్పి.. సీఎం బయటకు వెళ్లారన్న కారణంతో మూడున్నర గంటల పాటు సభను బ్రేక్‌లోనే ఉంచారని ధ్వజమెత్తారు. మొన్న భట్టి విక్రమార్క ప్రసంగం ఇంకా సిద్ధం చేసుకోలేదంటూ గంటపాటు వాయిదా వేశారన్నారు. బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి? అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీలో హరీశ్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నుంచైనా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని కోరారు. గత రెండేళ్లలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరుచేయలేదని, ఎకరాకు రూ.10 వేల చొప్పున బాధిత రైతులకు చెల్లించాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా జలాశయాల్లో చేప, రొయ్య పిల్లలను వదలడం లేదని, ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయిస్తే... మత్స్యకారులకు రూ.3వేల కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.