Share News

‘ఓటుకు నోటు’లో స్టే ఎత్తేస్తే రేవంత్‌ జైలుకే

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:56 AM

ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టే ను సుప్రీం కోర్టు ఎత్తేస్తే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సిందేనని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు...

‘ఓటుకు నోటు’లో స్టే ఎత్తేస్తే రేవంత్‌ జైలుకే

  • ముఖ్యమంత్రి పదవీ ఊడిపోవడం ఖాయం కేసీఆర్‌కు పోటీగా సీఎం సభ పెట్టడం సిగ్గు చేటు

  • కేసీఆర్‌ ఆదేశాల మేరకే నేను, మరో ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లాం.. దాచిపెట్టేదేం లేదు: హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టే ను సుప్రీం కోర్టు ఎత్తేస్తే రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సిందేనని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ తరఫున జగదీశ్‌ రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, సత్యవరాథోడ్‌, మహమూద్‌అలీ ఇంప్లీడ్‌ అయ్యారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, ఇందులో స్టే వెకేట్‌ అయితే.. రేవంత్‌ ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతోనే సీనియర్‌ న్యాయవాదులను కలిసేందుకే ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌, తాను బహిరంగంగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేం లేదని అన్నారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, అలాగే మే 6న హైకోర్టులో రానున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్‌ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లామన్నారు. ఈ విషయమై రేవంత్‌రెడ్డి మీడియాకు లీకులిస్తూ డ్రామాలు ఆడారని, విషయం లేనివాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్‌ సభ జరుగుతుందని తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎంతో హుందాగా, రేవంత్‌ పేరు తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే.. రేవంత్‌ మాత్రం రంకెలు వేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్‌ స్టేట్స్‌ మ్యాన్‌లా మాట్లాడితే.. రేవంత్‌రెడ్డి.. స్ట్రీట్స్‌ మ్యాన్‌లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారని విమర్శించారు. రేవంత్‌ తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మాట విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లయినా దక్కుతాయన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్‌.. కేసీఆర్‌ సభకు భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి.. ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుంటామని చెబుతున్నారన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:56 AM