Share News

TG Govt Whip Aadi Srinivas: హరీశ్‌ రావువి పిచ్చి మాటలు

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:09 AM

సినీ పరిశ్రమ పచ్చగా ఉంటే చూడలేని హరీశ్‌రావు.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పదేళ్లు సినీ పరిశ్రమను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలు..

TG Govt Whip Aadi Srinivas: హరీశ్‌ రావువి పిచ్చి మాటలు

  • సినీ పరిశ్రమ పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారు: ఆది

  • సీఎం రేవంత్‌.. సామాజిక విప్లవకారుడు: మల్లు రవి

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సినీ పరిశ్రమ పచ్చగా ఉంటే చూడలేని హరీశ్‌రావు.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పదేళ్లు సినీ పరిశ్రమను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు తెగ ప్రేమ చూపిస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాచకొండ గుట్టల్లో ఫిల్మ్‌ సిటీ కట్టిస్తామని ప్రగల్భాలు పలికి.. చిన్న రాయి కూడా తీయలేదని విమర్శించారు. హీరోలు, నిర్మాతల ప్రయోజనం కోసమే ఆనాడు కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రీమియర్‌ షోలకు అనుమతినిచ్చారని, కానీ తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుందన్నారు. ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లేలా జీవో ఇచ్చిందని, సినీ కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు.. వారి పిల్లల చదువు కోసం ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. హరీశ్‌.. ముందు వారి ఇంట్లో సినిమా గురించి ఆలోచించాలని, లేకుంటే ఆయన కథ క్లైమాక్స్‌కు చేరుకుంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్‌ ఓ సామాజిక వైద్యుడు.. సామాజిక విప్లవకారుడని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి కొనియాడారు. పేదరికం ఓ రోగమైతే.. రాజకీయాలే దానికి ఔషధమన్నది నానుడి అని, ఈ విషయంలో సీఎం రేవంత్‌ సామాజిక వైద్యుడిలా పనిచేస్తున్నారన్నారు. మొదట్నుంచీ సమాజంలోని అనేక రుగ్మతలను కాంగ్రెస్‌ పాలకులు నిర్మూలించారన్నారు. పేదరిక నిర్మూలన, పేదలకు భూముల పంపిణీ, 20 సూత్రాల పథకం అమలు, ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, 18 ఏళ్లకే ఓటు హక్కు, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలతో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు.

Updated Date - Jan 12 , 2026 | 04:11 AM