ఆటలకు, అందాల పోటీలకు కోట్లు ఉన్నాయి .. రైతుబంధుకు మాత్రం డబ్బుల్లేవా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:45 AM
రాష్ట్రానికి పైసా ఆదాయం రాని ఫుట్‌బాల్ ఆటలకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.. రైతుబంధు ఇచ్చేందుకు మాత్రం....
రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, పిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి పైసా ఆదాయం రాని ఫుట్‌బాల్ ఆటలకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.. రైతుబంధు ఇచ్చేందుకు మాత్రం డబ్బుల్లేవా?’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చుచేస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. ‘‘మూసీ సుందరీకరణ, ఫోర్త్‌సిటీ పేరుతో వేలకోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, రైతుబంధు కోసం నిధులు లేవనడం హాస్యాస్పదం. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతారు కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నను ఆదుకోవడానికి చేతులు రావు. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుబంధు జమచేస్తామని చెప్పిన సీఎం.. ఇప్పటికీ ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికైనా పగటివేషాలు, ఓట్లకోసం నాటకాలు కట్టిపెట్టి వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు తప్ప.. అభివృద్ధి ఏమీ లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మాజీఎమ్మెల్యే బాల్కసుమన్‌ను కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని, సీఐడీ విచారణ జరిపేంత ఏముందని ప్రశ్నించారు. పోలీసులూ.. జాగ్రత్త! మూడేళ్లల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది.. ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరించారు.