తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ బేరసారాలు!
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:14 AM
కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ హక్కులను సీఎం రేవంత్ కాలరాస్తున్నారని.. కర్నాటకతో తుంగభద్ర జలాలను బేరసారాల అంశంగా....
కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం..తెలంగాణ హక్కులను బలిపెడతారా?
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోరేం?
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ హక్కులను సీఎం రేవంత్ కాలరాస్తున్నారని.. కర్నాటకతో తుంగభద్ర జలాలను బేరసారాల అంశంగా మార్చారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ఈ మేరకు సీఎంకు హరీశ్ లేఖ రాశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్.. అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ‘‘తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 టీఎంసీలు), చిక్కాలపర్వి(2.5 టీఎంసీలు), చిక్కాలమంచి (5 టీఎంసీలు) బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు రేవంత్ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జూలై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి? సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు, తెలంగాణ, ఏపీ అనుమతులు లేకుండానే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు చేపడుతోంది. దానిపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టినట్టేనా’’ అని హరీశ్ ప్రశ్నించారు. కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణకు నీటి వాటా అందడం కష్టమని పేర్కొన్నారు. దీనిపై అధికారికంగా స్పందించాలని డిమాండ్ చేశారు.