తిరుపతన్న.. ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావుకు అన్ని సార్లు ఫోన్లెందుకు చేశారు!?
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:23 AM
ఎస్‌ఐబీ కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ చానల్ యజమానికి చెందిన ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు మాజీ మంత్రి హరీశ్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది
నంబర్లు ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయాలని కోరారా!?
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నంబర్లు ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా!?
పోలీసులు తమ వాంగ్మూలాల్లో ‘పెద్దాయన’ అని అంటున్నారు.. ఆ పెద్దాయన ఎవరు!?
మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ ప్రశ్నలు
ఏడున్నర గంటలపాటు విచారించిన అధికారులు
మరోసారి పిలిచే అవకాశం ఉందని సంకేతాలు
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీ కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ చానల్ యజమానికి చెందిన ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు మాజీ మంత్రి హరీశ్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ‘ఆ న్యూస్ చానల్ యజమానికి, అతనికి సహకరించిన ఎస్‌ఐబీ బృందానికి మీరేమైనా ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయాలని కోరారా? లేకపోతే నాటి ఎస్‌ఐబీ బృందంలోని తిరుపతన్న, ప్రణీత్‌రావు, చానల్ యజమాని శ్రవణ్ రావుతో ఫోన్లో అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు!?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీశ్ రావును సిట్ అధికారులు మంగళవారం ఏడున్నర గంటలపాటు విచారించారు. జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హరీశ్ వచ్చారు. న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. విచారణకు కేవలం ఒక్కరే రావాలని, న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో హరీశ్ రావు ఒక్కరే లోపలికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేసి ఆయనను పంపివేశారు. హరీశ్‌ను ప్రధానమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించామని, మరోసారి ఆయనను పిలిచే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. హరీశ్ వాంగ్మూలాన్ని వీడియో సాక్ష్యాలతో నమోదు చేశామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నాటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బృందం, నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఎన్నికను పర్యవేక్షించిన హరీశ్ రావు చెప్పినట్లు వారు కొందరి ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలూ ఇప్పటికే వెలువడ్డాయి. వాటిపై హరీశ్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిందితుల పాత్రను సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారు. త్వరలో తుది చార్జిషీట్ దాఖలు చేయడానికి ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు కూడా.
ఈ నేపథ్యంలోనే, రాజకీయ కోణానికి సంబంధించి ఉన్న ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఫోన్ ట్యాపింగ్ వెనక రాజకీయ ఆదేశాలు ఉన్నాయన్న అనుమానాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. సిట్ దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి చాలాసేపు హరీశ్‌ను ప్రశ్నించారు. ఆ తర్వాత ఎస్పీ రవీందర్ రెడ్డి కూడా కొద్ది సేపు ఆయనను ప్రశ్నించారని తెలుస్తోంది. ఇక, హరీశ్ కొందరి నంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆపై టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఆయా వ్యక్తులపై కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ వాటి విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించలేదని తెలుస్తోంది. కాగా.. విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు హరీశ్ రావు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాల్లో ‘పెద్దాయన’ అన్న విషయం పలుమార్లు వచ్చిన క్రమంలో ‘ఆ పెద్దాయన ఎవరు!?’ అని సిట్ అధికారులు హరీశ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాంతో, తాను హోం మంత్రిగా లేనని, తనకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయని ఆయన బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టైన అధికారులు తమ తమ వాంగ్మూలాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.