Share News

తెలంగాణ ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరించండి!

ABN , Publish Date - May 28 , 2026 | 03:18 AM

విద్యుత్‌ మూడో డిస్కం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలంటూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను...

తెలంగాణ ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరించండి!

  • రైతు డిస్కం డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఇవ్వకండి

  • ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీశ్‌ లేఖ

హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ మూడో డిస్కం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలంటూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను(ఈఆర్‌సీని) బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు కోరారు. కమిషన్‌ బహిరంగ విచారణ పూర్తికాకముందే జూన్‌ 2నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం, విచారణ పూర్తికాకముందే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తోందన్నారు. రైతుల కోసం డిస్కం కావాలని విద్యుత్‌ సంస్థల నుంచి ప్రతిపాద న లేదని, రైతులు, రైతుసంఘాలు, ప్రజాప్రతినిధులు అడగలేదని, క్యాబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక కూడా లేదన్నారు. ఆర్థిక పరమైన అంశాలు జీఓ 44లో పేర్కొంటూ ప్రభు త్వం ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపే కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు. మూడో డిస్కం ఏర్పాటు కేవ లం ఆర్థికపరమైన విషయాల కోసం తప్ప రైతుల సంక్షే మం గురించి మాత్రం కాదని అర్థమవుతోందన్నారు. ఇటువంటి కీలక నిర్ణయం అసెంబ్లీలో చర్చించకపోవడం ఎన్నో సందేహాలను లేవనెత్తుతోందన్నారు. విద్యుత్‌ రంగంలో భాగస్వాములైన రైతులు, ఉద్యోగులు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చని ఈ ప్రతిపాదనను బీఆర్‌ఎస్‌ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యలు, లోపాలను దృష్టిలో ఉంచుకొని రైతు డిస్కంకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ దరఖాస్తును తిరస్కరించాలని హరీశ్‌రావు ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 28 , 2026 | 03:18 AM