నిరుద్యోగులకు సర్కారు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:05 AM
ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు.
2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. వారి పట్ల అవమానకరంగామాట్లాడినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శనివారం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ‘హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. దరఖాస్తు చేసుకోవడానికి వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి తరలి రావడం వారి తప్పా? లేక ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం తప్పా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్టు?’ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు 32నెలలు దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేల మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా?2 లక్షల ఉద్యోగాల హామీ ఒక బోగస్’అని ఎద్దేవా చేశారు. పీజీలు చేసిన యువత కూడా చిన్న పోస్టుల కోసం పోటీ పడడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.