రూ.2 లక్షల రుణమాఫీ జీవో అమలుకు ఆదేశించండి
ABN , Publish Date - May 08 , 2026 | 06:42 AM
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణ మాఫీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి..
హైకోర్టులో పిల్ దాఖలు చేసిన హరీశ్ రావు
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణ మాఫీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి.. దానిని రైతులందరికీ వర్తింపజేయకుండా అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ మేరకు 2024లో జారీ చేసిన చేసిన రైతు రుణమాఫీ జీవో 567ను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌కు హైకోర్టు రిజిస్ట్రీ రెగ్యులర్ నంబర్ ఇవ్వలేదు. పరిశీలన దశలోనే ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. రైతులు కష్టాల్లో ఉన్నారని.. ప్రభుత్వం చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాకపోవడంతో వడ్డీలు చెల్లించలేకపోతున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై సర్కారు వివరణ తెలుసుకొని చెప్పాలంటూ ప్రభుత్వ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా పడింది.