Share News

మూసీ బాధితులకు అండగా ఉంటాం..

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:41 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుక భూముల కబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.

మూసీ బాధితులకు అండగా ఉంటాం..

  • సీఎం రేవంత్‌ ప్రతి అడుగు వెనుక భూకబ్జాలే.. మూసీ శుద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తారా?: హరీశ్‌

  • కాంగ్రెస్‌ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారు: కొండా

  • మధు పార్క్‌ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల వేర్వేరు భేటీలు

నార్సింగ్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుక భూముల కబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చి బడా కాంట్రాక్టర్లకు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న గండిపేట మండలం హైదర్షాకోట్‌, బండ్లగూడ బాధితులను ఆదివారం కలిసి మాట్లాడారు. ఆయనతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ కార్తీక్‌రెడ్డి ఉన్నారు. మధుపార్క్‌ రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌ మాట్లాడుతూ.. మూసీ బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని.. వారి పక్షాన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఆనాడు కేసీఆర్‌ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే, రేవంత్‌ బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధుపార్క్‌ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదని.. ప్రజల కోసం, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమే మాట్లాడుతున్నామని చెప్పారు. ‘చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌, రైతులకు రైతు బంధు అడిగితే డబ్బుల్లేవని సీఎం అనడం విడ్డూరంగా ఉంది. పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌, మిస్‌ వరల్డ్‌ పోటీలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? బడా కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు?’ అని నిలదీశారు. మూసీ బాధితులను బీజేపీ నేతలు కూడా పరామర్శించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌, రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జ్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డితో కలిసి హైదర్షాకోట్‌, బండ్లగూడ బాధితులతో మాట్లాడారు. అనంతరం మధురీడ్జ్‌ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాన్ని ఖండిస్తున్నామని.. మధుపార్క్‌ అపార్ట్‌మెంట్‌ వాసులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. మూసీ సుందరీకరణ అంటూ ప్రజలను బలి చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. బీజేపీది ఎప్పుడూ ప్రజల పక్షమేనని.. ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని చెప్పారు.


గత సర్కారు కమీషన్ల కక్కుర్తి వల్లే.: చామల

మధు పార్క్‌ అపార్ట్‌మెంట్‌ వాసులను హరీశ్‌ పక్కదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి వల్లనే వారు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2012లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కాకుండా మధు పార్క్‌ బిల్లర్లు బఫర్‌ జోన్‌లోనే అపార్ట్‌మెంట్‌ కట్టారని.. 30 మీటర్ల బఫర్‌ ఉండాల్సిన చోట 9 మీటర్ల బఫర్‌ చూపించి అనుమతి తీసుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్కారు ఆ బిల్లర్లపై కేసు పెట్టి వారితోనే అపార్ట్‌మెంట్‌ వాసులకు నష్టపరిహారం ఇప్పిస్తుందని హామీనిచ్చారు. హరీశ్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌ అభివృద్ధిని ఆపలేరని.. చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ చూపిస్తున్న హరీశ్‌.. బీఆర్‌ఎస్‌ హయాంలో మల్లన్నసాగర్‌ నిర్వాసితుల బాధలు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ నిలదీశారు. ఆనాడు 14 గ్రామాల ప్రజలు ఆందోళన చేసినా.. కొందరు చనిపోయినా కనికరించని హరీశ్‌.. ఇవ్వాళ కన్నీరు కారుస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాటు మూసీ అభివృద్ధి పేరుతో కార్పొరేషన్‌ పెట్టి రూ.వేలకోట్లు దండుకున్నది బీఆర్‌ఎస్‌ పెద్దలు కాదా అని ప్రశ్నించారు. మూసీని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Feb 23 , 2026 | 02:41 AM