Share News

రైతు సంక్షేమం గురించి మీరా చెప్పేది?

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:31 AM

రైతు సంక్షేమం గురించి హరీశ్‌ రావుతో చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

రైతు సంక్షేమం గురించి మీరా చెప్పేది?

  • హరీశ్‌ రావుకు విప్‌ బీర్ల అయిలయ్య బహిరంగ లేఖ

  • నీచరాజకీయాలు చేస్తున్న హరీశ్‌: వేముల వీరేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమం గురించి హరీశ్‌ రావుతో చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. కొద్దిరోజులుగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వం శరవేగంగా కొంటున్న విషయం ఆయనకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం హరీశ్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటి దాకా 7,70,053 టన్నుల ధాన్యం, 3,46,121 టన్నుల మొక్కజొన్న, 30,220 టన్నుల శనగలు, 3,492 టన్నుల పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేసిందని వివరించారు. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బు జమచేయడమూ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగట్లేదంటూ అబద్ధపు ప్రచారంతో హరీశ్‌ రావు నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం మండిపడ్డారు. హరీశ్‌రావు ఇంటిమందు.. ఆయనే సీసీ కెమెరాలు పెట్టించుకున్నారని, నిజంగా అవి హ్యాక్‌ అయి ఉంటే.. వాటిని అమర్చిన ఏజెన్సీదే బాధ్యత అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఎంపీ మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కంటున్న కల.. పగటి కలగానే మిగిలిపోనుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 05:31 AM