Share News

శంషాబాద్‌ భూకుంభకోణంపై సిట్‌ వెయ్యాలి

ABN , Publish Date - May 27 , 2026 | 04:27 AM

శంషాబాద్‌లో వెయ్యికోట్ల విలువైన భూముల కుంభకోణంపై సిట్‌, సీఐడీతో దర్యాప్తు చేయించాలని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

శంషాబాద్‌ భూకుంభకోణంపై సిట్‌ వెయ్యాలి

  • స్కాం వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలెవరో తేలాలి.. సీఎం సన్నిహితుడు ఉండడం వల్లే ఏసీబీ వెనక్కు వచ్చింది

  • తహసీల్దార్‌ను బదిలీ చేసి సరిపెడతారా ?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, కవాడిగూడ, మే 26 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌లో వెయ్యికోట్ల విలువైన భూముల కుంభకోణంపై సిట్‌, సీఐడీతో దర్యాప్తు చేయించాలని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సీఎం సన్నిహితుడు ఒకరు ఈ వ్యవహారంలో ఉండడం వల్లే.. ఈ కేసులో తహసీల్దార్‌పై విచారణకు వెళ్లిన ఏసీబీ వెనక్కు వచ్చేసిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్‌ను బదిలీ చేసి ఊరుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానిది నిజంగా ప్రజాపాలనైతే తహసీల్దార్‌ను వెంటనే డిస్మిస్‌ చేయాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో హరీశ్‌ మాట్లాడారు. శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరిగిందన్నారు. ఈ వ్యవహారం పత్రికల్లో రాగానే సంబంధిత తహసీల్దార్‌ను బదిలీ చేసి, భూమి మ్యుటేషన్‌ చేసుకున్నట్లు తెలిపారన్నారు. భూభారతిలో భూమి చేరాలంటే.. దరఖాస్తు పెట్టాలి, దానిని ఆర్డీవో ఆమోదించాలని భూభారతి చట్టం చెబుతోందని హరీశ్‌ తెలిపారు. కానీ, తహసీల్దార్‌ భూభారతిలో పెట్టాలని చెప్పగానే అది భూభారతిలో ఎంట్రీ అయిపోయిందని పేర్కొన్నారు. సదరు భూమి ప్రభుత్వ భూమి అని, ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఆర్డీవో.. తహసీల్దార్‌కు చెప్పడమే కాక ప్రొహిబిటరీ లిస్టు 22ఏలో పెట్టాలని ఆదేశించారన్నారు. కానీ, ఆర్డీవో ఆదేశాలను ధిక్కరిస్తూ 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా అని ఎలా ఎక్కించారో సమాధానం చెప్పాలన్నారు. 2026 ఫిబ్రవరి 24న సదరు భూమి ప్రభుత్వానికి చెందినదని పేర్కొన్న తహసీల్దార్‌.. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందనే ఆర్డర్‌ పాస్‌ చేశారని హరీశ్‌ పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఎలా అయ్యిందో చెప్పాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్‌ భిన్నంగా ఇస్తే జీపీ రెవెన్యూ.. హైకోర్టుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.


ఏ ఆర్డర్‌ అయినా కలెక్టర్‌ ఆమోదంతోనే హైకోర్టుకు వెళుతుందని, మరి కలెక్టర్‌ ఎలా ఆమోదించారని నిలదీశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే కేవలం తహసీల్దార్‌ను బదిలీ చేసి ఊరుకోవడం సరికాదన్నారు. ఈ కుంభకోణం విషయంలో ఏసీబీ అధికారులు దాడులకు వెళ్లగా.. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో కానీ ఏసీబీ వెనక్కు వచ్చేసిందని హరీశ్‌ ఆరోపించారు. ఈ కుంభకోణంపై సిట్‌, సీఐడీ విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి భూ కుంభకోణంలో భాగస్వామ్యం లేకపోతే సదరు తహసీల్దార్‌నుడిస్మిస్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

చేవెళ్ల డిక్లరేషన్‌ అమలు చేయకుంటే..

రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు హెచ్చరించారు. చేవేళ్ల డిక్లరేషన్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీలనుమోసం చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి లంబాడీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పిఎ్‌స) తెలంగాణ రాష్ట్ర కమిటీ.. ‘నంగారా భేరి’ పేరుతో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మహాఽధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్‌ మాట్లాడుతూ.. ఇది లంబాడీల ధర్నా కాదని, వారి ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ సాక్షిగా ప్రారంభమైన పోరాటం రాష్ట్రంలోని ప్రతీ తండాకు చేరాలని పిలుపునిచ్చారు.

ఆ బొగ్గు ఎక్కడుందో చెప్పండి ?

సింగరేణి వెబ్‌సైట్‌లో చూపుతున్న 40లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు స్టాక్‌ ఎక్కడుందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి హరీశ్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గు ఎక్కడుందోనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ప్రశ్నించాలన్నారు. కాంగ్రెస్‌ హటావో.. సింగరేణి బచావో అనేది కార్మికుల నినాదం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - May 27 , 2026 | 04:27 AM