Share News

దమ్ముంటే.. విచారణ రికార్డుబయటపెట్టాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:21 AM

లీకులిచ్చి చిల్లర రాజకీయాలు చేయడం కాదు. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ రికార్డు మొత్తం బయటపెటాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు.

దమ్ముంటే.. విచారణ రికార్డుబయటపెట్టాలి

  • ఎన్ని కుట్రలు చేసినా నా గొంతు గర్జిస్తూనే ఉంటుంది

  • మా ప్రభుత్వం వచ్చాక సీఎం బావమరిది దోపిడీని కక్కిస్తాం: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, నార్సింగి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘‘లీకులిచ్చి చిల్లర రాజకీయాలు చేయడం కాదు. దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ రికార్డు మొత్తం బయటపెటాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు. ఉద్యమాలు, పోరాటాలు తమకు కొత్త కాదని, కేసీఆర్‌ నాయకత్వంలో రాటుదేలిన సైనికులమని, కాంగ్రెస్‌ నాయకుల్లాగా నోటీసులు రాగానే పారిపోయే రకం తాము కాదని విమర్శించారు. ‘‘మీరిచ్చే నోటీసులను నేను ప్రజా పోరాటంలో దక్కిన గౌరవంగా భావిస్తాను. పోలీసుల వెనక దాక్కుని పిరికి పందలా నోటీసులు పంపడం కాదు. రాజకీయంగా ఎదుర్కో. నువ్వెన్ని కుట్రలు పన్నినా హరీశ్‌ రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుంది. నోటీసులకు మేం భయపడం. నోటీసులిచ్చి నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు’’ అంటూ ఆగ్రహం వ్యక్తచేశారు. సిట్‌ విచారణకు హాజరు కావడానికి ముందు మంగళవారం ఉదయం కోకాపేటలోని తన నివాసంలో; విచారణ తర్వాత రాత్రి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణకు వెళ్లడానికి ముందు బీఆర్‌ఎస్‌ న్యాయవాదుల బృందం, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. విచారణకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనకు ఇచ్చిన సిట్‌ నోటీసంతా ట్రాష్‌ అని, నిరాధార ఆరోపణలు, అడిగిందే అడుగుడు, రేవంత్‌ సృష్టించిన సొల్లు పురాణం తప్ప ఏమీ లేదని కొట్టిపారేశారు. ‘‘సిట్‌ అధికారులు గంట ేసపు విచారణ చేస్తారు. బయటి నుంచి ఫోన్లు రాగానే ముగ్గురు అధికారులు వెళ్లి బయట మాట్లాడుకుని వస్తారు. గంట తర్వాత వచ్చి మళ్లీ అడిగిందే అడిగారు. బయటి నుంచి ఫోన్‌ వచ్చిందని సైగ చేస్తే.. బయటకు వెళ్తారు. అవతల నుంచి రేవంత్‌ రెడ్డి చేశారో.. సజ్జనార్‌ ఫోన్‌ చేశారో తెలియదు. మాట్లాడేందుకు వెళ్లి.. మరో గంట తర్వాత వచ్చి.. కొత్తగా అడిగేందుకు ఏమీ లేక పాత పాటనే పాడుతూ.. సాయంత్రం వరకు గడిపారు. ఇదంతా సీఎం రచించిన స్ర్కిప్ట్‌లా కనబడుతోంది’’ అని మండిపడ్డారు. రేవంత్‌ చిల్లర రాజకీయాలపై అసహ్యం వేస్తోందన్నారు. అక్రమ కేసులు తనకు కొత్తకాదని, అన్నింటినీ ఎదుర్కొంటానన్నారు.


బొగ్గు స్కామ్‌ బయటపెట్టినందుకే..

సీఎం రేవంత్‌ రెడ్డి బామ్మర్ది బొగ్గు బాగోతాన్ని బయట పెట్టినందుకే కక్షపూరితంగా తనకు నోటీసులు ఇచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన బామ్మర్ది బాగోతాన్ని పొద్దున్న బయటపెడితే సాయంత్రానికి నోటీసులు ఇచ్చారని, రేవంత్‌ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ‘‘నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రే సిద్దిపేట నుంచి వచ్చి ఇప్పుడు సిట్‌ విచారణకు వెళ్తున్నాను. నిన్న బొగ్గు స్కాం బయటపెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు మాట్లాడలేదు’’ అని వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు తమ అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతుందని రేవంత్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ మొదలు పెట్టారనివిమర్శించారు. ‘‘ఉద్యమంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నా. మేం తెలంగాణ ఉద్యమకారులం. కేసీఆర్‌ తయారు చేసిన సైనికులం. రేవంత్‌రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడం’’ అని స్పష్టం చేశారు. కుంభకోణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నానని, కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌చేశారు. తాము వచ్చాక రేవంత్‌రెడ్డి బావమరిది సింగరేణి, నైనీ బ్లాక్‌ టెండర్లలో చేసిన అక్రమాలను బయటపెట్టడమే కాకుండా.. వాటిని రద్దు చేసి, అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు.

Updated Date - Jan 21 , 2026 | 05:21 AM