దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రా!
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:10 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేవ ఉంటే, దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలి. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలోనే చూసుకుందాం.....
ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్
సిద్దిపేట క్రైం/సిద్దిపేట కల్చరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేవ ఉంటే, దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలి. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలోనే చూసుకుందాం’’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. సీఎం హోదాలో ఉండి పాలన గాలికొదిలేసి, తన ఎత్తు, రూపం గురించి దిగజారి మాట్లాడటం రేవంత్‌రెడ్డికే చెల్లిందని మండిపడ్డారు. హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేటలో జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో మాట్లాడారు. నల్లగొండ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో ముగ్గురు సీఎంల మీటింగ్‌పై, కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల రక్షణపై నేను ప్రశ్నిస్తే.. రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేక నల్లగొండ వెళ్లి పరుష పదజాలంతో తిడుతూ తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాను, జగదీశ్‌రెడ్డి పొట్టిగా ఉన్నా ప్రజలకు సేవ చేయడంలో పొడుగ్గానే ఉన్నామని, రేవంత్ బుద్ధి, ఆలోచనలు పొట్టివి కాబట్టే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.