Share News

ట్రూ-అప్‌కు అనుమతించొద్దు!

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:53 AM

డిస్కమ్‌ల అసమర్థత, నియంత్రించడానికి వీలున్నా తగిన చర్యలు తీసుకోకపోవడమే ట్రూ-అప్‌ పిటిషన్లకు కారణమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

ట్రూ-అప్‌కు అనుమతించొద్దు!

  • నియంత్రించడానికి వీల్లేని కారణాలేవీ లేవు

  • డిస్కమ్‌ల అసమర్థతే పిటిషన్లకు కారణం

  • ఈఆర్‌సీకి మాజీ మంత్రి హరీశ్‌రావు సూచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌ల అసమర్థత, నియంత్రించడానికి వీలున్నా తగిన చర్యలు తీసుకోకపోవడమే ట్రూ-అప్‌ పిటిషన్లకు కారణమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నియంత్రించడానికి వీల్లేని కారణాలకే ట్రూ అప్‌ పిటిషన్లను అనుమతించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు టీజీఎన్పీడీసీఎల్‌, టీజీఎస్పీడీసీఎల్‌ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లను అనుతించవద్దని కోరారు. 2022-23, 2023-24 సంవత్సరాల్లో అనుమతించిన దానికన్నా తక్కువ ఆదాయం వచ్చిందని, ఆ రెండేళ్లకుగాను వినియోగదారుల నుంచి రూ.9331.09 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతించాలంటూ రెండు డిస్కమ్‌లు ట్రూ-అప్‌ పిటిషన్లు సమర్పించాయి. దీంతోపాటు 2024-25లో ఎక్కువ ఆదాయం వచ్చినిందున రూ.798.87 కోట్లను వినియోగదారులకు వెనక్కి ఇవ్వడానికి ట్రూ-డౌన్‌ పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై అభ్యంతరాలు/సూచనలు/సలహాలు కోరాయి. అయితే డిస్కమ్‌ల ట్రూ-అప్‌ పిటిషన్లలో వాస్తవికత లేదని, వీటిని తోసిపుచ్చాలని హరీశ్‌రావు కోరారు. తక్కువ ధరకు లభించే జలవిద్యుత్‌ను సరిగ్గా వినియోగించుకోలేదని, కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు కూడా తక్కువ ధరకే కరెంట్‌ ఇస్తున్నప్పటికీ.. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కరెంట్‌ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కాగా, సర్‌ప్లస్‌ విద్యుత్‌ ఉందని చెబుతూనే బహిరంగ విపణిలో విద్యుత్‌ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఏముందని విద్యుత్‌ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాలరావు ప్రశ్నించారు. పిటిషన్‌ వాస్తవ విరుద్ధంగా ఉందని, ట్రూ-అప్‌ క్లెయిమ్‌ను ఆమోదించరాదని సూచించారు. కాగా, కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గితే.. స్థిర చార్జీలు కూడా తగ్గకుండా ఎందుకు పెరిగాయని పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ కన్వీనర్‌ తిమ్మారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Feb 08 , 2026 | 06:54 AM