24 గంటల విద్యుత్‌కు కోత పెట్టేందుకే..రైతు డిస్కం పేరిట సర్కార్ నాటకాలు
ABN , Publish Date - May 30 , 2026 | 04:09 AM
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌కు కోత పెట్టేందుకే రేవంత్‌రెడ్డి సర్కార్.. రైతు డిస్కం పేరిట నాటకాలాడుతోందని, వారి అసలు కుట్ర రైతులకు నష్టం కలిగించడమేనని....
ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడం దుర్మార్గం: హరీశ్‌రావు
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌కు కోత పెట్టేందుకే రేవంత్‌రెడ్డి సర్కార్.. రైతు డిస్కం పేరిట నాటకాలాడుతోందని, వారి అసలు కుట్ర రైతులకు నష్టం కలిగించడమేనని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. ‘‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరంలేదు. 3 గంటలు చాలని ఈఆర్‌సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయి. అమెరికా వేదికగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి’’ అని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెడితే.. కాంగ్రెస్ అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడం దుర్మార్గమని మండిపడ్డారు.