Share News

తీర్పు చెప్పడానికి మీరేమైనా జడ్జీలా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:44 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుదితీర్పు ఇవ్వకముందే, ఇది ‘ఇల్లీగల్‌’ (చట్టవిరుద్థం) అని అధికారికంగా ప్రకటించడం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బాధ్యతారాహిత్యానికి...

తీర్పు చెప్పడానికి మీరేమైనా జడ్జీలా?

  • ట్యాపింగ్‌ను కోర్టు తేల్చక ముందే‘ఇల్లీగల్‌’ అని ఎలా ప్రకటిస్తారు?

  • సజ్జనార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

  • కేసీఆర్‌పై విచారణ ముగిసిందన్న సీపీ

హైదరాబాద్‌, పిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుదితీర్పు ఇవ్వకముందే, ఇది ‘ఇల్లీగల్‌’ (చట్టవిరుద్థం) అని అధికారికంగా ప్రకటించడం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. మీరేమైనా జడ్జిలా తీర్పు ఇవ్వడానికి అంటూ సోమవారం ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉండగా, ఒక నిర్ణయానికి వచ్చేసి సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇవ్వ డం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం విచారించడమేనని, తీర్పు లు చెప్పాల్సింది కోర్టులేనని గుర్తుచేశారు. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అంశంలో.. ఇలాం టి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టమవుతోందన్నా రు. ఖాకీ డ్రెస్‌ వేసుకొని రాజకీయ అజెండాలు అమలు చేయడం ఆల్‌ ఇండియా సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధమని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించేవరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయసూత్రమని, దీన్ని పాటించకపోవడం శోచనీయమన్నారు. సజ్జనార్‌ విడుదల చేసిన అధికారిక ఎక్స్‌ ప్రకటనలో కనీసం కేసీఆర్‌ను గౌరవ ప్రతిపక్ష నాయకులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని హరీశ్‌రావు నిలదీశారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ విచారణ ముగిసిందని సీపీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు.

హార్వర్డ్‌కెళ్లినా బుద్ధి మారని రేవంత్‌

అమెరికాకెళ్లి హార్వర్డ్‌కెళ్లి చదువుకున్నా సీఎం రేవంత్‌ రెడ్డి బుద్ధి మారలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ద్వేషపూరిత ఉపన్యాసాలపై జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి హితబోధ చేసిన కొన్ని క్షణాల్లోనే అదే వేదికపై రేవంత్‌ అసలు స్వభావాన్ని బయ ట పెట్టుకున్నారన్నారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోట్లో విషం పెట్టుకున్న రేవంత్‌.. తన అజీర్తిని, అక్కసును మరోసారి ప్రదర్శించారన్నారు. సీఎం తన వెనకటి గుణం మార్చుకోలేదని, కనీస సంస్కారం రాలేదని, చిల్లర మాట ల్లో, వెకిలి చేతల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. ద్వేష రాజకీయాలు, విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనమన్న హరీశ్‌ రావు.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ జాతిపిత అయినట్లే.. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 02:44 AM