రేవంత్ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రీ
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:57 AM
సీఎం రేవంత్ రెడ్డి.. గుంపు మేస్త్రీ అయితే తమకు అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రీ కావొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
కర్ణాటక, ఏపీ కలిసి తెలంగాణను ముంచుతుంటే..అడ్డుకోకుండా వారితో కలిసి సంబురాలా?: హరీశ్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి.. గుంపు మేస్త్రీ అయితే తమకు అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రీ కావొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల సీఎంలు సమావేశమై ఒప్పందం చేసుకున్నారని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణను ముంచుతుంటే.. ఆయా రాష్ట్రాల సీఎంలతో కలిసి రేవంత్ రెడ్డి సంబురాలు చేసుకోవడం సరికాదని విమర్శించారు. ఆర్డీఎ్‌సకు ఎగువన కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల సామర్థ్యంతో నవేలి జలాశయం నిర్మిస్తున్నదని, మరోవైపు ఆర్డీఎ్‌సకు దిగువన సుంకేసుల బ్యారేజీకి ఎగువన 20 టీఎంసీలతో గుండ్రేవుల ప్రాజెక్టు చేపడుతోందన్నారు. కర్ణాటక, ఏపీ రెండు రాష్ట్రాలు కలిసి 35 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కాన్నారు. దీనివల్ల శ్రీశైలం మీద ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు సీఎంల సమక్షంలో జరిగిన చీకటి ఒప్పందం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.