62 సార్లు ఢిల్లీ వెళ్లి.. తెచ్చింది సున్నా: హరీశ్
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:05 AM
రాష్ట్రాభివృద్ధి కోసమంటూ 62సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధి కోసమంటూ 62సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ఆయనకు గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై సమీక్షించే తీరికలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ చూస్తే ఆయన సాధించింది శూన్యమని అర్థమైందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని, కనీసం పురుగుల్లేని అన్నమైనా పెట్టమంటూ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలను బూతులు తిట్టడం తప్ప రేవంత్‌రెడ్డికి గురుకులాలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. హార్వర్డ్‌లాంటి యూనివర్సిటీలకు వెళ్లొచ్చినా విద్యార్థుల పట్ల రేవంత్ దృక్పథం మారలేదని దుయ్యబట్టారు. ఓయూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కనీస గౌరవం లేకుండా అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఓయూ సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.