Share News

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్‌ సిటీ రద్దు

ABN , Publish Date - May 23 , 2026 | 04:45 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఫ్యూచర్‌ సిటీని వందశాతం రద్దు చేస్తాం.. గతంలో తాము ప్రతిపాదించినట్లుగానే ఫార్మాసిటీని ఏర్పాటు...

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్‌ సిటీ రద్దు

  • ఫార్మాసిటీ భూములను మళ్లించేలా రేవంత్‌ ప్రభుత్వం ప్రయత్నం

  • ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ వ్యాపారానికి యత్నం: హరీశ్‌రావు

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఫ్యూచర్‌ సిటీని వందశాతం రద్దు చేస్తాం.. గతంలో తాము ప్రతిపాదించినట్లుగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఇది తన మాట కాదని, పార్లమెంట్‌ చట్టం ఆధారంగా చెబుతున్నానని అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతుల వద్ద భూములను సేకరిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వినియోగించాలని చూస్తోందన్నారు. మన దగ్గర ఉన్న ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటకు వెళ్లకూడదని, ఫార్మాసిటీ వస్తే.. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ ప్రయత్నం ప్రారంభించామన్నారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, అందులో ఏదైనా మార్పు(డీవియేషన్‌) ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్‌ చట్టంలోనే ఉందన్నారు. రేవంత్‌ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని, ఈ మధ్య హైకోర్టులో ఓ కేసులో తాము ఫార్మాసిటీనే కొనసాగిస్తున్నామని కోర్టుకు చెప్పిందన్నారు. నిబంధనల ప్రకారం 75 శాతం ఫార్మా సిటీ ఉండి... 25 శాతం మిగతావి ఉండాలని, అలాంటిది 75 శాతం రియల్‌ వ్యాపారం కోసం కేవలం 25 శాతమే ఫార్మాకు వచ్చేలా చేస్తున్నారన్నారు. ఇది చట్టప్రకారం చెల్లదని.. కాంగ్రెస్‌ ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. చివరి ఏడాది అంతా ఎన్నికల హడావుడి ఉంటుందని, ఈలోపు భూములు పంచి పెట్టి చివరి దశలో ఏదో ఒక లబ్ధి పొందాలని రేవంత్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు. వాళ్లేం చేసినా నడవదు.. నిలబడదు.. అక్కడ ఫార్మా సిటీనే వస్తుందని హెచ్చరించారు.

Updated Date - May 23 , 2026 | 04:45 AM