Harish Rao Criticizes: నిధులు దారి మళ్లిస్తుంటే సర్కార్ చోద్యం చూస్తోంది
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:45 AM
కృష్ణాజలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18కోట్ల నిధులను కేఆర్‌ఎంబీ దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం.....
టెలిమెట్రీల ఏర్పాటులో ప్రభుత్వాల నిర్లక్ష్యం: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18కోట్ల నిధులను కేఆర్‌ఎంబీ దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. టెలీమెట్రీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. టెలిమెట్రీల ఏర్పాటును ఆలస్యం చేస్తూ, ఉద్దేశపూర్వకంగా ఏపీకి సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్‌ఎంబీ, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. కాగా, యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సీవోడీ పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని మిగిలిన రెండు యూనిట్లను త్వరితగతిన పూర్తిచేసి, కమర్షియల్ ఆపరేషన్‌లోకి తేవాలని డిమాండ్ చేశారు.