Share News

అవినీతి కోసమే ఎక్సెస్‌ టెండర్లు!

ABN , Publish Date - May 02 , 2026 | 06:00 AM

కాంగ్రెస్‌ పెద్దలు తమ అవినీతి కోసం హ్యామ్‌ రోడ్లకు సంబంధించి అంచనా వేసిన విలువ కంటే అధిక ధరలకు ఎక్సెస్‌ టెండర్లు వేయించారని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆధారాలతో సహా తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని....

అవినీతి కోసమే ఎక్సెస్‌ టెండర్లు!

  • అసెంబ్లీలో మేము చెప్పిందే ఇప్పుడు నిజమైంది

  • రేవంత్‌ చర్యలతో ప్రభుత్వానికి నష్టం: హరీశ్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పెద్దలు తమ అవినీతి కోసం హ్యామ్‌ రోడ్లకు సంబంధించి అంచనా వేసిన విలువ కంటే అధిక ధరలకు (ఎక్సెస్‌) టెండర్లు వేయించారని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆధారాలతో సహా తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల్లో 25 టెండర్లను అధిక ధరలకు కొందరికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఆర్‌అండ్‌బీ శాఖలో రూ. 11 వేల కోట్లకు టెండర్‌ పిలిస్తే దానిని రూ. 15 వేల కోట్లకు, పంచాయతీరాజ్‌ శాఖలో రూ. 6 వేల కోట్ల టెండర్లను దాదాపుగా రూ. 8 వేల కోట్లకు కట్టబెట్టనున్నట్లు తెలిపారు. వీటిలో ఒకే కంపెనీకి 15 టెండర్లు దక్కనున్నాయని, ఆ వివరాలను త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 5 వేల కోట్ల మేర నష్టం కలగడమే కాకుండా రాష్ట్ర ప్రజలపై కూడా తీవ్రమైన భారం పడుతుందన్నారు. ఈ టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మొబిలైజేషన్‌ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేశామని, 5 శాతం కంటే ఎక్కువ కోట్‌ చేసిన ఎక్సెస్‌ టెండర్లను వెంటనే రీకాల్‌ చేశామని తెలిపారు. ఇప్పుడు 25 శాతం టెండర్‌ ఎక్సెస్‌ వేస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్‌అండ్‌బీలో రిటైర్‌ అయిన చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జోగారెడ్డి పదవీకాలం పొడిగించి ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సలహాదారులు ఉండరని, పొడిగింపులు ఉండవని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్‌ విభాగంలో అధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తున్నారని తెలిపారు. హ్యామ్‌ రోడ్లలో ఎక్సెస్‌ టెండర్లు రద్దు చేయాలని, అన్ని టెండర్లను తక్షణం రీకాల్‌ చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 02 , 2026 | 06:00 AM