కాంగ్రెస్, బీజేపీలది అపవిత్ర పొత్తు
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:31 AM
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధమని, ఇది మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీఆర్‌ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.
సిద్ధాంతాలను గాలికొదిలేసిన జాతీయ పార్టీలు: హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధమని, ఇది మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీఆర్‌ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తమ పార్టీని అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికి వదిలేసి అపవిత్ర పొత్తు కుదుర్చుకున్నాయని, అధికారం కోసం జెండాలు, అజెండాలను పక్కన బెట్టి ఎలా దిగజారవచ్చో నిరూపించాయని హరీశ్‌రావు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు. అందలమెక్కేందుకు అధికారులను పావులుగా వాడుకునే కౌన్సిలర్లను భయబ్రాంతులకు గురి చేసి కుఠిల రాజకీయం చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలూ పరస్పరం ముసుగు వేసుకుని పని చేస్తున్నాయన్న హరీశ్‌రావు.. వీటి అపవిత్ర కలయికను అసహ్యించుకున్న తెలంగాణ సమాజం భవిష్యత్తులో వాటికి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నడిపేది కాంగ్రెస్ సర్కారా..? బీజేపీ సర్కారా...? బీజేపీ, టీడీపీలతో కూడిన సంకీర్ణ సర్కారా? అని ప్రశ్నించారు. ఆలియాబాద్ నుంచి అమన్‌గల్ దాకా.., మెట్‌పల్లి నుంచి మెదక్ వరకూ ఆ పార్టీల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న మునిసిపాలిటీల్లోనూ కుట్రలతో పదవులు దక్కించుకున్నాయని మండి పడ్డారు. నర్సాపూర్‌లో చైర్మన్ పదవి తీసుకున్న కాంగ్రెస్.. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం కంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదని స్పష్టం చేశారు. బీజేపీతో జత కట్టడమేనా కాంగ్రెస్ తెస్తామన్న మార్పు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఢిల్లీలో బీజేపీ పెద్దలంటే... తెలంగాణలో కమలనాథులు కాంగ్రెస్ యుక్త్ భారత్ అని నిరూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.