నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం
ABN , Publish Date - May 03 , 2026 | 04:22 AM
నిరుద్యోగులు, ప్రజలను నమ్మించి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేతహరీశ్ రావు విమర్శించారు. శనివారం సిద్దిపేటలోని గ్రంథాలయంలో...
ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వేయాలి
లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం: హరీశ్ రావు
సిద్దిపేట అర్బన్, మే 2 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు, ప్రజలను నమ్మించి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేతహరీశ్ రావు విమర్శించారు. శనివారం సిద్దిపేటలోని గ్రంథాలయంలో నిరుద్యోగ యువతతో ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు అంటూ నమ్మబలికారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సినిమా థియేటర్ల ప్రారంభోత్సవానికి పోతున్నారు కానీ.. పక్కనే ఉన్న అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి మాత్రం పోవడం లేదని, ఆయనకు ఆ ధైర్యం లేదన్నారు. మెగా డీఎస్సీ అంటూ ఊరించి దగా డీఎస్సీ చేశారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకూ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగ యువతతో కలిసి సచివాలయాలన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.