Share News

తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటు

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:14 AM

తెలంగాణ క్యాబినెట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటని, ఈ చర్య ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునే ఉందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటు

  • ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

  • స్కాంలు తప్ప.. ఇక్కడ స్కీమ్‌ల అమల్లేదు

  • హామీలను అమలు చేయాలని సీఎంకు హితబోధ చేయండి

  • కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వానికి హరీశ్‌ లేఖ

హైదరాబాద్‌, పిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ క్యాబినెట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటని, ఈ చర్య ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునే ఉందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నామని, ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లుతూ రాష్ట్ర మంత్రివర్గం ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతోందని మండిపడ్డారు. తాము ఓట్లేసి ఎన్నుకున్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేక ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, కర్ణాటక సీఎం సిద్దారామయ్యకు బుధవారం హరీశ్‌ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో సమీక్ష నిర్వహిస్తున్న మీకు, ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకు మీరిచ్చిన హామీలను గుర్తు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో స్కీంలేవీ లేకపోగా స్కాములు మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయని, ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడంలేదన్నారు. తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్‌ దోపిడీ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్‌ రాజకీయ అవసరాలకు ఎరువుగా మారుతోందని ఆరోపించారు. క్యాబినెట్‌ సమీక్షలో మీరు అడిగేది ప్రజలకు ఇచ్చిన మాటల గురించా? లేక మీకు అందుతున్న వాటాల గురించా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా 20లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. సజావుగా ఎరువులు కూడా సరఫరా చేయలేని కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు అనేక తిప్పలు పడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికైనా త్వరగా హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రికి హితబోధ చేయాలని ఆయన కోరారు.

Updated Date - Feb 19 , 2026 | 05:14 AM