మీరు పుట్టించిన ఈ వినాశనం..రేపు మిమ్మల్నే కబళిస్తుంది
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:16 AM
కాంగ్రెస్ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతి తప్పిందని.. రాష్ట్ర పన్నుల ఆదాయంలో తగ్గుదల కరోనా సమయం కంటే కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు
ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం ఆపి అభివృద్ధి వైపు అడుగులు వేయండి
లేదంటే తెలంగాణ సమాజం క్షమించదు
ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ రాష్ట్రం బాగుండాలి: హరీశ్ రావు
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతి తప్పిందని.. రాష్ట్ర పన్నుల ఆదాయంలో తగ్గుదల కరోనా సమయం కంటే కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అంటే కరోనా కంటే కాంగ్రెస్సే ప్రమాదం అని అర్థమైందని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పుట్టించిన ఈ వినాశనం.. రేపు కాంగ్రెస్‌నే కబళిస్తుంది’’ అని హెచ్చరించారు. ‘‘ఇప్పటికైనా అబద్ధాలు ఆపి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు’’ అని హితవుపలికారు. పద్దులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన హరీశ్.. సర్కారుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుందని, విధ్వంసాన్ని క్షమించదని.. కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ‘‘ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ రాష్ట్రం బాగుండాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎ్‌సను ఓడించినా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ఓడించొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదని.. ఆర్థిక, సామాజిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గానికి నిలువుటద్దం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోల్లో ఆకాశమంత హామీలు, బడ్జెట్‌లో అసంపూర్తి నిధులు, క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు అని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. ‘‘కాంగ్రెస్ నాయకుల సంకల్పంలో ప్యూరిటీ (స్వచ్ఛత) లేదు.. మాటల్లో క్లారిటీ (స్పష్టత) లేదు..ప్రసంగాల్లో శాంక్టిటీ (పవిత్రత) లేద’’ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఏం దక్కిందని ప్రశ్నించారు. 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్‌ఎ్‌సను బద్నాం చేసిన కాంగ్రెస్.. బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం శ్రీశ్రీ కవితలను ఉపయోగించుకుందన్నారు. నిజంగా శ్రీశ్రీ బతికి ఉంటే కాంగ్రెస్ చేసిన మోసాన్ని చూసి.. మరో కవిత రాసేవారేమో అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరును రేవంత్ ఆత్మీయ మోసంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
ఏఐ తెస్తానన్నారంటే.. ఇలా అనుకోలేదు!
ప్రజల జీవన స్థితిగతులు మార్చే లెక్కలు కాంగ్రెస్ బడ్జెట్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితం అని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడుతున్నట్టు పుస్తకంలో ఫొటో పెట్టుకున్నారని.. నిజంగా ఆడాడా? అని ప్రశ్నించారు. ‘‘ఏఐ తెస్తా ఏఐ తెస్తా అంటే ఇట్లా తెస్తారనుకోలేద’’ని ఎద్దేవా చేశారు. ఇది సీఎం ప్రైవేటు ఫొటో ఆల్బమా లేక ప్రభుత్వం డాక్యుమెంటా అని ప్రశ్నించారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి విషయంలో సభను మంత్రి తప్పుదోవ పట్టించారని హరీశ్ ఆరోపించారు. ‘‘ఫిలిప్పీన్స్‌కు బియ్యం విషయంలో కుంభకోణం జరిగింది. బియ్యం ఎగుమతి చేయడానికి.. ఘరానా మోసగాడు, సీబీఐ, ఈడీ కేసులు ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్‌ను అడ్వయిజర్‌గా ఎలా పెట్టుకున్నారు?’’ అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వ నాఫెడ్‌ను కాదని, ప్రైవేట్ సంస్థలకు ఏ విధంగా పని అప్పగించారని నిలదీశారు. ‘‘7500 టన్నుల బియం కాకినాడ పోర్ట్‌లో ఉన్నాయి. గోడౌన్, హ్యాండ్లింగ్ చార్జీలు ప్రభుత్వమే కట్టాలి. అన్నీ కలిపితే నష్టం వచ్చినట్లే లెక్క’’ అని గుర్తుచేశారు. ‘‘7500 టన్నుల బియ్యం ఏమయ్యాయి? మంత్రిగారు హెలికాప్టర్‌లో పోయారు. దీనివెనుక పెద్ద స్కామ్ జరిగింది. దీనిపై హౌస్ కమిటీ వేస్తే.. అక్రమాలను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఆయన ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పగా.. ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ కూర్చుంటున్నామని హరీశ్ అన్నారు. ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ అంశంపై మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల భద్రతను పట్టించుకోవట్లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన నిధులను సమయానికి అందించట్లేదని ఆరోపించారు. దానికి నిరసనగా ఆ చర్చ నుంచి వాకవుట్ చేస్తున్నామని ప్రకటించి.. సభ నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే మరో ప్రశ్నకు సంబంధించిన అంశంపై చర్చ ప్రారంభంకాగానే సభలోకి వచ్చారు.
నిబంధనలు పాటించాలి..
హరీశ్‌రావు ప్రసంగం అయిపోగానే సభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా బయటకు వెళ్లిపోయారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభ్యంతరం తెలపగా.. సభ నిబంధనలను సభ్యులు పాటించాలని, ఎప్పుడూ రూల్ బుక్ పట్టుకొని ప్రశ్నించే వారు సభలో తమ ప్రసంగం అయిపోగానే. బయటకు వెళ్లడం తగదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యనించారు. బీఆర్‌ఎస్ నేత గంటల తరబడి మాట్లాడితే మంత్రులతోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలంతా సభలోనే కూర్చున్నారని గుర్తుచేశారు. అలాంటిది తాము మాట్లాడే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఏకమొత్తంలో బయటకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు.